వేరొకరి లోన్‌కు మీరు గ్యారంటీ ఇస్తున్నారా..? జాగ్రత్త.. మీకు జరిగే నష్టాలివే..

వేరొకరి లోన్‌కు మీరు గ్యారంటీ సంతకం పెడుతున్నారా.. వాళ్లు తిరిగి చెల్లించకపోతే మీరు చెల్లించాల్సి ఉంటుందా..? ఈ నిబంధనల గురించి తెలుసుకోకుండా చాలామంది సంతకం పెడుతుంటారు. అయితే గ్యారంటీ ఇచ్చిన వ్యక్తికి కూడా సమాన బాధ్యత ఉంటుందని రూల్స్ చెబుతున్నాయి. అవేంటంటే..

వేరొకరి లోన్‌కు మీరు గ్యారంటీ ఇస్తున్నారా..? జాగ్రత్త.. మీకు జరిగే నష్టాలివే..
Loan

Updated on: Nov 16, 2026 | 5:50 PM

హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్.. ఇలా ఏ లోన్‌ తీసుకోవాలన్నా సరే బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థలు హామీదారుడి సంతకం, అతడి ఆధార్ వివరాలు కోరతాయి. ఎవరైనా వ్యక్తి గ్యారంటీ సంతకం పెట్టకపోతే సాధారణంగా లోన్లు మంజూరు చేయవు. దీంతో లోన్ తీసుకునే వ్యక్తి.. తన కుటుంబసభ్యులు, బంధువులు లేదా స్నేహితులను హామీదారులుగా ఉంచాల్సి ఉంటుంది. హామీదారుడు అంటే అప్పుకు బాధ్యత వహించడమని అర్థం. మీరు మీ స్నేహితుడు లేదా మీ బంధువులు, ఇంకెవరి రుణానికి అయినా హామీ ఇస్తుంటే ఈ రూల్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేకపోతే మీరు ఆర్ధిక కష్టాల్లోకి వెళ్లే అవకాశముంటుంది.

లోన్ ఎగ్గొడితే హామీదారుడు చెల్లించాల్సిందే

అవును.. లోన్ తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించడంలో విఫలమైతే గ్యారంటీర్‌పై ఆ బాధ్యత పడుతుంది. మీరు చెల్లించాల్సిందిగా బ్యాంకులు డిమాండ్ చేయవచ్చు. మీ నుంచి రుణాన్ని బ్యాంకులు వసూలు చేయవచ్చని ఆర్బీఐ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. రుణగ్రహీత ఈఎంఐ చెల్లించకపోయినా, లోన్ ఎగ్గొట్టినా ఆర్ధికంగా మీరు నష్టపోవడమే కాకుండా మీ సిబిల్ స్కోర్‌పై కూడా ప్రభావం చూపిస్తుంది. హామీ అంటే ఏదో సంతకం పెట్టడం కాదు.. అతడి చెల్లించకపోతే మీరే కట్టాల్సి ఉంటుంది. భారతీయ ఒప్పందాల చట్టం 1872లోని సెక్షన్ 128 ప్రకారం రుణగ్రహీతతో సమానంగా హామీదారుడికి బాధ్యత ఉంటుంది. దీంతో ఎవరి రుణానికైనా మీరు హామీదారుడిగా ఉంటుంటే ఈ నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

భవిష్యత్తులో మీకు రుణం రాకపోవచ్చు

రుణం తీసుకున్న వ్యక్తి ఎగ్గొడితే మీరు చెల్లించాల్సి రావడంతో పాటు మీ సిబిల్ స్కోర్ కూడా ప్రభావితం అవుతుంది. రుణగ్రహీత సమాచారంతో పాటు హామీదారుడి వివరాలు కూడా క్రెడిట్ రికార్డులో నమోదు చేస్తారు. దీంతో రుణగ్రహీత ఈఎంఐ చెల్లించడంలో జాప్యం చేసినా లేదా రుణం ఎగ్గొట్టినా మీ క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రభావం చూపుతుంది. మీ క్రెడిట్ రిపోర్టులో రికార్డ్ అయి ఉండటం వల్ల మీకే నష్టం జరుగుతుంది. దీని వల్ల భవిష్యత్తులో మీకు రుణాలు పొందటం కష్టతరంగా మారుతుంది.

ఈ జాగ్రత్తలు అవసరం

మీరు ఎవరి రుణానికి అయినా హామీ ఇస్తుంటే.. వారి ఆదాయం, ఉద్యోగం, అప్పటికే ఉన్న అప్పులు, ఈఎంఐలను పరిగణలోకి తీసుకోండి. కేవలం వారితో ఉన్న సంబంధం, స్నేహం కారణంగా గ్యారంటీర్‌గా ఉంటే మీరు ఆర్ధికంగా నష్టపోవాల్సి ఉంటుందని అర్ధం చేసుకోండి. తొందరపాటులో నిర్ణయం తీసుకుని మీరు ఇబ్బందులు పడకుండా చూసుకోండి. సొంత కుటుంబసభ్యులకు కానివారికి హామీ ఇచ్చేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి.

Loading...
Unable to load recommendations.
Follow Us