
Mutual Fund Nominee: ప్రతి ఆర్థిక పథకానికి ఒక నామినీని నియమించడం తప్పనిసరి. బ్యాంకు ఖాతాకు కూడా నామినీని అడుగుతారు. ఎఫ్‌డీ వంటి ఏ పథకానికైనా నామినీని నియమించాలి. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు, డీమ్యాట్ ఖాతాదారులు కూడా నామినీని నియమించాలి. మీకు నామినీ వద్దు అనుకుంటే దానికి కూడా ఒక అవకాశం ఉంది. సెబీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, నామినీ కాలమ్‌ను ఖాళీగా వదిలివేయకూడదు. నామినీని తప్పనిసరిగా నియమించాలి, లేదా నామినీ ఎవరూ లేరని పేర్కొనాలి.
నామినీని నియమించకపోతే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు ఏమవుతుంది?
పెట్టుబడిదారుడు తెలిసిగానీ, తెలియకగానీ తన మరణానికి ముందు నామినీని నియమించకపోతే మ్యూచువల్ ఫండ్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఆస్తి యథాతథంగా ఉంటుంది. దానిని పెట్టుబడిదారుడి వారసులకు బదిలీ చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. ఇది అంత త్వరగా జరిగే విషయం కాదు.
నిధులను బదిలీ చేయడానికి వారసులు ఏమి చేయాలి?
ఒకవేళ పెట్టుబడిదారుడు మరణించి తన ఆస్తులను బదిలీ చేయాలనుకుంటే వారు చట్టబద్ధమైన వారసులని నిరూపించుకోవాలి. వారసత్వ ధృవీకరణ పత్రం వంటి పత్రాలను సమర్పించాల్సి రావచ్చు. ఈ వారసత్వ ధృవీకరణ పత్రం పొందడానికి నెలల సమయం పట్టవచ్చు. అప్పటి వరకు పెట్టుబడి ఆస్తులు యథాతథంగా ఉంటాయి.
నామినీ లేని పక్షంలో వారసులు మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. వారు తమ గుర్తింపు పత్రాన్ని, మరణించిన వ్యక్తితో తమకున్న సంబంధాన్ని తెలిపే పత్రాన్ని అందించాలి. వీలునామా ఉన్నట్లయితే దానిని కోర్టు ధృవీకరించాలి. వీలునామా లేనట్లయితే, కోర్టు నుండే వారసత్వ ధృవీకరణ పత్రాన్ని పొందాలి.
చిన్న పెట్టుబడుల కోసం, కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఆస్తి బదిలీకి నోటరైజ్డ్ నష్టపరిహార పత్రం (ఇండెమ్నిటీ బాండ్), అఫిడవిట్‌ను అంగీకరించవచ్చు. అయితే పెట్టుబడి మొత్తం పెద్దగా ఉన్నప్పుడు అన్ని చట్టపరమైన ప్రక్రియలను తప్పనిసరిగా పాటించాలి. ఒక మంచి న్యాయవాది ద్వారా కోర్టు అనుమతి పొందడం అత్యవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి