
జియో మరో సంచలన నిర్ణయానికి నాంది పలికింది. భూమిపై మొబైల్ నెట్‌వర్క్‌లు, ఫైబర్ రంగంలో దూసకెళ్తున్న జియో.. ఇప్పుడు ఏకంగా అంతరిక్షంపై కన్నేేసింది. దాదాపు 1,600 శాటిలైట్లతో కూడిన ప్రతిపాదిత కాన్‌స్టెలేషన్‌తో పాటు భారత్‌లో 23 గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. భౌగోళికంగా టెరెస్ట్రియల్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడం, కష్టమైన ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తోన్నట్లు జియో తెలిపింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2026లో శాటిలైట్ కనెక్టివిటీ విజన్ గురించి ప్రకటన జారీ చేసింది. ‘సావరిన్ శాటిలైట్ కనెక్టివిటీ’గా దీనిని చెబుతుండగా.. ఇందులో సుమారు 1,600లో ఎర్త్ ఆర్బిట్ (LEO) శాటిలైట్లతో కూడిన ప్రతిపాదిత కాన్‌స్టెలేషన్‌ను సమావేశంలో ఆవిష్కరించారు. డిజైన్, ఇంజినీరింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ నుంచి లాంచ్, డిప్లాయ్‌మెంట్, ఆపరేషన్స్ వరకు భారత్‌లోనే నియంత్రణ ఉండేలా వ్యవస్థను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
ఈ ప్రణాళికలో భాగంగా జియో 23 ప్రతిపాదిత గ్రౌండ్ స్టేషన్లు కీలక పాత్ర పోషించనున్నాయని చెప్పవచ్చు. ఇందులో భాగంగా శాటిలైట్ నెట్‌వర్క్‌ను భారత భూభాగంలోని టెరెస్ట్రియల్ మౌలిక వసతులతో అనుసంధానించనున్నారు. శాటిలైట్ నెట్‌వర్క్‌ను ఇప్పటికే కలిగి ఉన్న టెరెస్ట్రియల్ నెట్‌వర్క్‌తో అనుసంధానించే ప్రణాళిక కూడా జియో చేస్తోంది. భారత భూభాగం, సముద్ర ప్రాంతాలకు 100 శాతం కవరేజ్, 6 లక్షలకు పైగా గ్రామాలకు కనెక్టివిటీ అందించే విజన్‌ను ఈ ప్రదర్శనలో చూపించారు. మారుమూల గ్రామాలు, ద్వీప ప్రాంతాలు, సరిహద్దు ఔట్‌పోస్టులు ప్రధాన దృష్టి ప్రాంతాలుగా ఉండగా.. ఎంటర్‌ప్రైజ్ కనెక్టివిటీ, రిమోట్ సైట్లు, ఏవియేషన్, మారిటైమ్, ప్రభుత్వ రంగం, రక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో కూడా ఈ టెక్నాలజీని వినియోగించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డైరెక్ట్-టు-డివైస్ (D2D) కాలింగ్ సదుపాయాన్ని కూడా కల్పించే లక్ష్యం పెట్టుకున్నారు.
ఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ థీమ్ ‘స్కేల్ వితౌట్ బౌండరీస్’గా నిర్ణయించారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఎంసీ 10వ ఎడిషన్‌ను ప్రారంభించారు. సాంకేతికత, కనెక్టివిటీని సంప్రదాయ పరిమితులను దాటి విస్తరించాలన్న ఆలోచనను ఈ థీమ్ ప్రతిబింబిస్తోంది. టవర్లు, ఫైబర్ నెట్‌వర్క్‌ల పరిమితులను దాటి అంతరిక్ష ఆధారిత మౌలిక వసతుల ద్వారా కనెక్టివిటీని విస్తరించే జియో శాటిలైట్ ప్రణాళిక దీనికి ఒక సాంకేతిక ఉదాహరణగా నిలుస్తోంది. కాగా ప్రస్తుతం 1,600 శాటిలైట్లు, 23 గ్రౌండ్ స్టేషన్లు రెండూ ప్రతిపాదిత ప్రణాళికలో భాగమే. భూమిపై ఉన్న నెట్‌వర్క్‌లను అంతరిక్ష ఆధారిత నెట్‌వర్క్‌లతో అనుసంధానిస్తూ కనెక్టివిటీని భూమి నుంచి అంతరిక్షం వరకు తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు జియో సిద్ధమవుతోంది.