
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్‌లో జియో ప్లాట్‌ఫార్మ్స్ (Jio Platforms) గ్రాండ్ ఎంట్రీ ఇండియన్ కార్పొరేట్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం (అక్టోబర్ 28, 2026) దలాల్ స్ట్రీట్‌లో జియో షేర్లు ఘనంగా లిస్ట్ కావడంతో.. మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) పరంగా టాటా గ్రూప్‌ను వెనక్కి నెట్టి రిలయన్స్ గ్రూప్ భారత్‌లోనే అత్యంత విలువైన వ్యాపార సామ్రాజ్యంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12.5 లక్షల కోట్లను దాటింది.
జియో మెరుపు లిస్టింగ్ తర్వాత భారతదేశంలోని దిగ్గజ బిజినెస్ గ్రూప్‌ల మార్కెట్ విలువలు ఈ క్రింది విధంగా నమోదయ్యాయి:
మొదటి స్థానం – రిలయన్స్ గ్రూప్: రూ. 28.9 లక్షల కోట్లు
రెండో స్థానం – టాటా గ్రూప్: రూ. 25.6 లక్షల కోట్లు
మూడో స్థానం – అదానీ గ్రూప్: రూ. 16.6 లక్షల కోట్లు
రిలయన్స్ గ్రూప్ ఏకంగా రూ. 3.23 లక్షల కోట్ల ఆధిపత్యంతో టాటా గ్రూప్‌ను అధిగమించి అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది.
Reliance Group Market Cap
లిస్టింగ్ ధర: ఐపీఓ ఇష్యూ ధర రూ. 1,119 తో పోలిస్తే దాదాపు 21.4 శాతం ప్రీమియంతో రూ. 1,358 వద్ద జియో షేర్లు మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి.
జియో మార్కెట్ క్యాప్: మొదటి రోజు లిస్టింగ్ ధర ఆధారంగా జియో ప్లాట్‌ఫార్మ్స్ విడిగా రూ. 12.5 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించింది.
నెంబర్ 1 – నెంబర్ 2 కంపెనీలు: రిలయన్స్ ఇండస్ట్రీస్ – జియో ప్లాట్‌ఫార్మ్స్.. ఈ రెండూ మాత్రమే కలిపి రూ. 28.7 లక్షల కోట్ల మార్కెట్ విలువతో భారత్‌లోనే అత్యంత విలువైన మొదటి, రెండో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీలుగా చరిత్ర సృష్టించాయి. ఈ రెండు కంపెనీల ఉమ్మడి విలువే టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ కంటే రూ. 3.1 లక్షల కోట్లు ఎక్కువ కావడం విశేషం.
దేశంలోనే భారీ వాటాదారుల బేస్: 79.8 లక్షల మంది (7.98 మిలియన్లు) వాటాదారులతో భారత్‌లోనే అతిపెద్ద షేర్‌హోల్డర్ బేస్ కలిగిన కంపెనీగా జియో అవతరించింది.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో జరిగిన సాంప్రదాయ గంట మోగించే (Bell-ringing) వేడుకకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ, నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ, అనంత్ అంబానీ హాజరయ్యారు.
లిస్టింగ్‌కు ముందు సభను ఉద్దేశించి మాట్లాడిన జియో ప్లాట్‌ఫార్మ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
“నేటి ఈ మార్కెట్ లిస్టింగ్ మా ప్రయాణానికి ముగింపు రేఖ కానే కాదు.. ఇది ఒక కొత్త మైలురాయికి ప్రారంభ రేఖ. మేము ఇన్వెస్టర్లతో పారదర్శకంగా కమ్యూనికేట్ చేస్తాం, ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటాం, అలాగే మా పనుల ద్వారా మీ నమ్మకాన్ని గెలుచుకుంటాం.’’ అని పేర్కొన్నారు.
(గమనిక: ఈ నివేదికలో గ్రూప్ మార్కెట్ క్యాప్ లెక్కింపులో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విలువను మినహాయించి కేవలం ప్రధాన లిస్టెడ్ కంపెనీలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు).