
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తులకు ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి బైద్యనాథ్ ధామ్ తో కూడిన అయోధ్య – కాశీ పుణ్యక్షేత్ర యాత్ర, అరుణాచలంతో దివ్య దక్షిణ యాత్ర పేరుతో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. దీని ప్రకారం బైద్యనాథ్ ధామ్ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలుతో అయోధ్య-కాశీ పుణ్య క్షేత్ర యాత్ర సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి జూలై 4న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక అరుణాచలంతో దివ్య దక్షిణ్ యాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు జూలై 20న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది.
అయోధ్య – కాశీ పుణ్య క్షేత్ర యాత్రలో విష్ణుపాద ఆలయం, కాశీ విశ్వనాథ్ ఆలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయం, గంగా హరతి, రామ జన్మ భూమి, హనుమాన్‌గర్హి, త్రివేణి సంగమం, బాబా బైద్యనాథ్ ఆలయ దర్శనం ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణలోని సికింద్రాబాద్ జంక్షన్, చర్లపల్లి, కాజీపేట్ జంక్షన్, వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం జంక్షన్ వంటి ముఖ్యమైన స్టేషన్లలో మార్గ మధ్యంలో ఇరువైపులా ప్రయాణికుల కోసం రైలు ఎక్కేందుకు, దిగేందుకు సౌకర్యం కల్పించబడింది. ఈ మొత్తం యాత్ర 10 రోజులు ఉంటుంది.
దివ్య దక్షిణ యాత్రలో అరుణాచలం ఆలయం, నటరాజ ఆలయం, శ్రీ రంగనాథస్వామి ఆలయం, బృహదీశ్వర ఆలయం, రామనాథస్వామి ఆలయం, మీనాక్షి అమ్మవారి ఆలయం, రాతి స్మారక చిహ్నం, కుమారి అమ్మవారి ఆలయం వంటివి సందర్శిస్తారు . తెలంగాణలోని సికింద్రాబాద్ , చర్లపల్లి , జనగాం, కాజీపేట , వరంగల్, మహబూబాబాద్ , ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని మధిర , విజయవాడ, తెనాలి, ఒంగోలు , నెల్లూరు, గూడూరు, రేణిగుంట వంటి ముఖ్యమైన స్టేషన్లలో మార్గ మధ్యంలో ఇరువైపులా ప్రయాణికుల కోసం రైలు ఎక్కేందుకు,దిగేందుకు సౌకర్యం కల్పించబడింది. ఈ మొత్తం యాత్ర 8 రోజులు ఉంటుంది.
-ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం
-ప్రయాణీకులకు ప్రయాణ బీమా
-వృత్తిపరమైన మరియు స్నేహపూర్వక టూర్ ఎస్కార్ట్‌ల సేవలు
– రైలులో భద్రత
– అవసరమైన సహాయం కోసం ఐఆర్‌సిటిసి టూర్ మేనేజర్లు పర్యటన పొడవునా మీతో పాటు ఉంటారు
-మరిన్ని విచారణల కోసం సందర్శించండి: www.irctctourism.com