
హైదరాబాద్ నుంచి చండీగఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్‌బ్యాంక్‌కు మంటలు అంటుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మే 5, 2026న జరిగిన ఈ ఘటనలో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, ఆరుగురిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పింది. విమానం చండీగఢ్‌లో దిగిన తర్వాత ప్రయాణికులు తమ బ్యాగులు సర్దుకుంటున్న సమయంలో ఒక ప్రయాణికుడి బ్యాగ్‌లో ఉన్న పవర్‌బ్యాంక్ అకస్మాత్తుగా వేడెక్కి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కొద్ది క్షణాల్లోనే క్యాబిన్‌లో పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయపడిపోయారు. పరిస్థితిని గమనించిన ఇండిగో సిబ్బంది వెంటనే అత్యవసర చర్యలు చేపట్టి ప్రయాణికులను త్వరితగతిన బయటకు తరలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ పవర్‌బ్యాంక్‌లో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీ అధిక వేడి, షార్ట్ సర్క్యూట్ లేదా సాంకేతిక లోపం కారణంగా పేలిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో విమాన ప్రయాణాల్లో పవర్‌బ్యాంక్‌ల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇప్పటికే పవర్‌బ్యాంక్‌ల వినియోగంపై కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. వాటి ప్రకారం పవర్‌బ్యాంక్‌లను కేవలం హ్యాండ్ బ్యాగ్‌లో మాత్రమే తీసుకెళ్లాలి. చెక్డ్ లగేజీలో లేదా ఓవర్‌హెడ్ బిన్‌లలో ఉంచడం అనుమతించబడదు. అలాగే విమాన ప్రయాణ సమయంలో పవర్‌బ్యాంక్‌తో మొబైల్ లేదా ఇతర పరికరాలను ఛార్జ్ చేయడం కూడా నిషేధం.
నిపుణుల ప్రకారం ఓవర్‌హెడ్ కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగితే వెంటనే గుర్తించడం కష్టమవుతుంది. అందుకే పవర్‌బ్యాంక్‌ను ప్రయాణికుడి దగ్గరే ఉంచాలని నిబంధనలు రూపొందించారు. ప్రయాణికులు నాణ్యమైన పవర్‌బ్యాంక్‌లను మాత్రమే ఉపయోగించాలని, అవి వేడెక్కితే వెంటనే సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. పెరుగుతున్న ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంతో ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా నియమాలను కచ్చితంగా పాటించడం అత్యంత కీలకమని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి