
సాధారణంగా మనది ఒకట్రెండు గంటల ప్రయాణం అయితే.. బైక్ మీద వెళ్తాం. అదే నాలుగైదు గంటల ప్రయాణానికి బస్సు లేదా కారు ఎక్కుతాం. ఇక ఎనిమిది గంటలు దాటితే.. కచ్చితంగా రైలు ఎక్కాల్సిందే. ఇక మన ఇండియన్ రైల్వేస్.. దేశంలోని ఎన్నో ప్రాంతాలకు వెళ్తుంటాయి. రైలులో ఒకరిది గంట ప్రయాణం అయితే.. మరొకరిది ఒక రోజు.. ఇంకొకరిది రెండు లేదా మూడు రోజుల ప్రయాణం ఉంటుంది.
మీకు ఇది తెల్సా.. మన రైల్వేస్‌లో అత్యంత పొడవైన రైలు ప్రయాణం ఉంది. అలాగే తక్కువ గంటల నిడివి గల ప్రయాణం కూడా ఉంది. భారత్‌లో అత్యంత పొడవైన రైలు మార్గం గుండా ప్రయాణించే రైలు.. వివేక్ ఎక్స్‌ప్రెస్.. ఈ ట్రైన్ అస్సాంలోని దిబ్రూఘర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు పయణిస్తుంది. అంటే దాదాపుగా 4,200 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది వారానికోసారి నడిచే ట్రైన్ కాగా.. గమ్యస్థానానికి చేరుకునేసరికి సుమారు 80 గంటలు పడుతుంది. ఈ రైలు తన గమ్యస్థానానికి చేరుకునేసరికి దాదాపుగా 50 స్టాప్‌లు ఆగుతుంది. కాగా, అస్సాంలోని పచ్చని తేయాకు తోటల నుంచి కన్యాకుమారి ఇసుక తీరం వరకు ఈ ట్రైన్ పచ్చని ప్రకృతి దృశ్యాలను చూపిస్తుంది.