
రిజర్వ్ బ్యాంక్ బంగారు నిల్వలు గణనీయంగా పెరిగాయి. 2025 మార్చి 31 నాటికి 57.12 శాతం పెరిగి వాటి విలువ రూ.4,31,624.8 కోట్లకు చేరుకుంది. ఈ పెరుగుదలకు ప్రధానంగా 54.13 మెట్రిక్ టన్నుల బంగారం చేరడం. అలాగే ఇటీవలె కాలంలో బంగారం ధర పెరుగుదల కారణమని చెప్పవచ్చు. గతేడాది అంటే మార్చి 31, 2024 నాటికి ఆర్బీఐ వద్ద 822.10 మెట్రిక్ టన్నుల బంగారం ఉండగా ప్రస్తుతం 879.58 మెట్రిక్ టన్నులు ఉంది. మొత్తంగా ఏడాది కాలంలో 57.48 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వ పెరిగినట్లు గురువారం విడుదల చేసిన ఆర్బీఐ వార్షిక నివేదిక పేర్కొంది.
అలాగే మార్చి 31, 2024 నాటికి బ్యాంకింగ్ శాఖ బంగారం నిల్వల విలువ రూ.2,74,714.27 కోట్లుగా ఉంది. మార్చి 31, 2025 నాటికి మొత్తం 879.58 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు విభాగాల మధ్య పంపిణీ చేశారు. 311.38 మెట్రిక్ టన్నులు ఇష్యూ విభాగానికి కేటాయించారు. ఇది మార్చి 31, 2024న 308.03 మెట్రిక్ టన్నులుగా ఉంది. మార్చి 31, 2025 నాటికి బ్యాంకింగ్ విభాగం 568.20 మెట్రిక్ టన్నులను కలిగి ఉంది, గతేడాది 514.07 మెట్రిక్ టన్నులుగా ఉంది. 2024-25 వార్షిక నివేదిక ప్రకారం.. బంగారం ధరలు పెరగడం, అమెరికా డాలర్లతో పోలిస్తే ఇండియన్ రూపీ విలువ తగ్గడం వల్ల అదనంగా 54.13 మెట్రిక్ టన్నుల బంగారం కొనుగోలు చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ర్యాంక్ పొందిన భారత్, అంతర్జాతీయంగా ఏడవ అత్యధిక బంగారు నిల్వలను కలిగి ఉన్న దేశంగా ఉంది.
ప్రపంచ బంగారు మండలి గణాంకాలు ఇటీవలి సంవత్సరాలలో భారతదేశ మొత్తం విదేశీ మారక నిల్వలలో బంగారం నిష్పత్తిలో గణనీయమైన పెరుగుదలను సూచిస్తున్నాయి. ఈ శాతం 2021లో 6.86 శాతం నుండి 2024 చివరి నాటికి 11.35 శాతానికి చేరుకుంది. విదేశీ మారక నిల్వలు ఆర్థిక వ్యవస్థలకు రక్షణాత్మక బఫర్‌గా పనిచేస్తాయి, జాతీయ కరెన్సీలకు స్థిరత్వాన్ని అందిస్తాయి, ద్రవ్యోల్బణ రేటును నియంత్రిస్తాయి, ఆర్థిక దృఢత్వం, పునాది బలానికి కీలకమైన కొలమానాన్ని సూచిస్తాయి. అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి చాలా దేశాలు తమ ఫారెక్స్ హోల్డింగ్‌లను డాలర్లలోనే నిర్వహిస్తున్నందున, యునైటెడ్ స్టేట్స్ డాలర్ ప్రాథమిక ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా కొనసాగుతోంది. అయితే డాలర్ విలువల్లో హెచ్చుతగ్గుల కారణంగా కేంద్ర బ్యాంకులు ప్రత్యామ్నాయ రిజర్వ్ ఆస్తిగా బంగారాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి