విదేశీ మారక నిల్వల్లో భారీ జంప్‌.. దేశ ఖజానాలో రూ.60 వేల కోట్లు!

పశ్చిమ ఆసియా సంక్షోభం, ముడి చమురు ధరల పెరుగుదల మధ్య భారత ఆర్థిక వ్యవస్థకు ఊరటనిస్తూ, విదేశీ మారక నిల్వలు ఒకే వారంలో 6.295 బిలియన్ డాలర్లకు పెరిగాయి. మొత్తం నిల్వలు 696.988 బిలియన్ డాలర్లకు చేరాయి. ముఖ్యంగా బంగారు నిల్వలు భారీగా పెరగడం ఈ వృద్ధికి దోహదపడింది.

విదేశీ మారక నిల్వల్లో భారీ జంప్‌.. దేశ ఖజానాలో రూ.60 వేల కోట్లు!
Forex Reserves India

Updated on: May 16, 2026 | 9:21 AM

పశ్చిమ ఆసియా సంక్షోభం, పెరుగుతున్న ముడి చమురు ధరలు, విదేశీ మారక ఒత్తిళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. RBI తాజా గణాంకాల ప్రకారం.. దేశ విదేశీ మారక నిల్వలు ఒకే వారంలో 6 బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయి. మే 8తో ముగిసిన వారంలో నిల్వలు 6.295 బిలియన్ డాలర్లు పెరిగి 696.988 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారత కరెన్సీ రూపాయిపై ఒత్తిడి కొనసాగుతున్న సమయంలో ఈ పెరుగుదల కీలకంగా మారింది. ఇదే సమయంలో అంతకు ముందు వారంలో విదేశీ మారక నిల్వలు 7.794 బిలియన్ డాలర్లు తగ్గి 690.693 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు ప్రారంభం కావడానికి ముందు, ఫిబ్రవరి చివర్లో భారత విదేశీ మారక నిల్వలు 728.494 బిలియన్ డాలర్ల సర్వకాల గరిష్ట స్థాయిని తాకాయి. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, చమురు ధరల పెరుగుదల కారణంగా రూపాయి బలహీనపడటంతో RBI డాలర్లను విక్రయిస్తూ మార్కెట్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. RBI విడుదల చేసిన వివరాల ప్రకారం విదేశీ మారక నిల్వల్లో కీలక భాగమైన ఫారెన్ కరెన్సీ అసెట్స్ 562 మిలియన్ డాలర్లు పెరిగి 552.387 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇందులో యూరో, పౌండ్, యెన్ వంటి విదేశీ కరెన్సీల విలువ మార్పుల ప్రభావం కూడా ఉంటుంది. ఇక బంగారు నిల్వల విలువ భారీగా పెరగడం ప్రత్యేకంగా గమనార్హం.

ఒకే వారంలో భారత బంగారు నిల్వల విలువ 5.637 బిలియన్ డాలర్లు పెరిగి 120.853 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అదనంగా భారతదేశానికి చెందిన స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs) 84 మిలియన్ డాలర్లు పెరిగి 18.873 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అలాగే IMF వద్ద భారత రిజర్వ్ స్థానం కూడా 12 మిలియన్ డాలర్లు పెరిగి 4.875 బిలియన్ డాలర్లకు చేరినట్లు RBI వెల్లడించింది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం విదేశీ మారక నిల్వల పెరుగుదల రూపాయి స్థిరత్వానికి, దిగుమతి ఖర్చుల నిర్వహణకు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసానికి కీలక మద్దతుగా నిలుస్తుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us