Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..

దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ వచ్చే ఏడాదిలో పట్టాలెక్కించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్‌లో ఇది పట్టాలెక్కనుండగా.. ప్రాజెక్ట్ పనుల్లో వేగం పుంజుకుంది. తాజాగా ఈ పనులకు సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.

Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..
Indias First Bullet Train

Updated on: Jun 02, 2026 | 4:40 PM

దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. తొలి బుల్లెట్ రైలు ముంబై-అహ్మదాబాద్ మార్గంలో రానున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే ఈ మార్గంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ పనులు ఊపందుకున్నాయి. ఈ కారిడార్ పనులపై రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరో కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ కారిడార్ పనుల్లో మరో నిర్మాణ మైలురాయి నమోదైనట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఐదు నెలల్లో మహారాష్ట్రలో మూడో పర్వత సొరంగం తవ్వకం పూర్తయిందని తెలిపింది. ఈ కారిడార్ పనుల్లో ఇది ఒక ముఖ్యమైన భాగంగా చెప్పవచ్చు.

తొలి హైస్పీడ్ రైలు నెట్ వర్క్

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా దహను తాలూకాలో సొరంగం పనులు పూర్తయ్యాయి. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ఇది మరో మైలురాయి అని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. 5 నెలల్లో మహారాష్ట్రలో 3వ పర్వత సొరంగం తవ్వకం పూర్తయిందని తెలిపారు. దీనిని ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుగా పిలుస్తున్నారు. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ పనులను చేపడుతోంది. ఈ కారిడార్ నిర్మాణానికి జపాన్ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఇండియాలో మొట్టమొదటి హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌గా దీనిని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.

తొలి ట్రైన్ ఎప్పుడంటే..?

ఈ బుల్లెట్ రైలు కారిడార్ మొత్తం 508 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్‌లోని ప్రధాన నగరాలు, ఆర్థిక కేంద్రాలను కలుపుతూ ముంబై, అహ్మదాబాద్‌లను అనుసంధానిస్తుంది. ఇప్పుడు భారీ సొరంగం నిర్మాణం పూర్తి కావడం నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. పూర్తయిన ప్రతి సొరంగ విభాగం, ప్రాజెక్టులోని మరో కష్టతరమైన భాగాన్ని దాటిస్తుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల రైళ్ల ద్వారా మహారాష్ట్ర, గుజరాత్‌లలోని వ్యాపార, పట్టణ కేంద్రాలను అనుసంధానించడమే ఈ కారిడార్ లక్ష్యం. ఇది పూర్తయిన తర్వాత, భారతదేశ రైలు మౌలిక సదుపాయాల చరిత్రలో ఒక ప్రధాన మార్పుకు నాంది పలుకుతుంది. కాగా 2027 ఆగస్ట్ నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌లోనే తొలి ట్రైన్ పట్టాలెక్కనుంది. బుల్లెట్ రైళ్ల కోసం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మొత్తం ఏడు కారిడార్లను ప్రకటించింది. అందులో ముంబై-అహ్మదాబాద్ కారిడార్ కూడా ఉంది. ఈ కారిడార్ పనులు షురూ చేస్తున్నారు.

Follow Us