
రైల్వే ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. జులై 15వ తేదీలోగా ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ 1999లో తీసుకొచ్చారు. కానీ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోవడం మాత్రం 2002లో ప్రారంభమైంది. మొదటి రోజు వెబ్‌సైట్‌లో కేవలం 29 టిక్కెట్లు మాత్రమే బుక్ చేసుకోగా.. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ ద్వారా ప్రతిరోజూ సగటున 14 లక్షలకు పైగా టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ కేవలం రైలు టిక్కెట్ల బుకింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. హోటల్, బస్సు, రైల్వే టికెట్ల బుకింగ్ వంటి సేవలను అందిస్తోంది.
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ అధునాతన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌పై పనిచేయనుంది. సర్వర్ సామర్థ్యం మరింతగా పెంచారు. దీంతో వెబ్ సైట్ వేగంగా లోడ్ అవ్వడంతో పాటు టికెట్లు వేగంగా పూర్తవుతాయి. ఇక బుకింగ్ సమయంలో అన్ని తరగతుల టికెట్ల లభ్యతను ఒకే ఒకేసారి చూడవచ్చు. అలాగే కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లో డైనమిక్ ఛార్జీల క్యాలెండర్ అందుబాటులోకి తెచ్చారు. అలాగే పేమెంట్ గేట్‌వే వైఫల్యాలను నివారించేందుకు, తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌ను వేగవంతం చేసేందుకు వెబ్‌సైట్‌లో ఈ-వాలెట్ ఫీచర్ ప్రవేశపెట్టారు. నిధులను ముందుగానే లోడ్ చేసుకోవడం వల్ల చెల్లింపు సమయంలో ఓటీపీల కోసం వేచి ఉండాల్సిన పని ఉండదు.
అలాగే ఈ వెబ్‌సైట్‌లో “దిశా” అనే ఏఐ ఆధారిత చాట్‌బాట్ తీసుకొచ్చారు. ప్రయాణికులు లాగిన్ చేయకుండానే తమ PNR స్టేటస్, టిక్కెట్ల రద్దు, రీఫండ్ స్టేటస్ వంటి చెక్ చేసుకోవచ్చు. ఈ ఏఐ చాట్ బాట్ వాయిస్, టెక్స్ట్ కమాండ్‌లు రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. అలాగే కొత్త వెబ్‌సైట్‌లో టూఫ్యాక్టర్ అథెంటికేషన్, క్యాప్చా వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. అలాగే అనధికార ఏజెంట్లు లేదా చట్టవిరుద్ధ సాఫ్ట్‌వేర్‌లు బల్క్ టిక్కెట్ బుకింగ్ చేయకుండా నిరోధించడానికి నిబంధనలు నిరంతరం కఠినతరం చేసేలా రూల్స్ తీసుకొచ్చారు. ఇక వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్పార్మ్ అవుతాయా.. లేదా అనేది 100 శాతం ఖచ్చితత్వంతో ముందుగానే తెలుసుకోవచ్చు. దీని వల్ల ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తమ ప్రయాణానికి చేసుకోవచ్చు. ఇందుకోసం కొత్త రిజర్వేషన్ సిస్టమ్‌లో ఏఐ ఫీచర్లు ప్రవేశపెట్టారు. ఈ ఏఐ ఫీచర్ గత రికార్డులను పరిశీలించి టికెట్ కన్పామ్ అవుతుదా.. లేదా అనేది ముందే అంచనా వేసి చెబుతోంది.