పెట్రోల్‌, డీజిల్‌ కొరత పుకార్లు..! కఠిన చర్యలకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!

దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి వంటి ఇంధన వదంతులపై కేంద్రం అప్రమత్తమైంది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు ఐటీ రూల్స్‌లో మార్పులు పరిశీలిస్తోంది. సోషల్ మీడియాలో అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించే గడువును 3 గంటల నుండి కేవలం 1 గంటకు కుదించాలని యోచిస్తోంది.

పెట్రోల్‌, డీజిల్‌ కొరత పుకార్లు..! కఠిన చర్యలకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!
Fuel Price Rumors

Updated on: Mar 26, 2026 | 12:06 PM

దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి వంటి ఇంధన రంగానికి సంబంధించిన వదంతులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం పాకకుండా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా IT (ఇంటర్మీడియట్‌ గైడ్‌లైన్స్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌) రూల్స్‌ కింద కొత్త మార్పులను అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అభ్యంతరకరమైన లేదా తప్పుడు కంటెంట్‌ను తొలగించడానికి ఉన్న గడువును గణనీయంగా తగ్గించాలనే యోచనలో ఉంది.

ప్రస్తుతం ఈ కంటెంట్ తొలగింపుకు మూడు గంటల సమయం ఇవ్వబడుతుండగా, దానిని కేవలం ఒక గంటకు కుదించాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఈ మార్పు అమల్లోకి వస్తే, తప్పుడు సమాచారాన్ని వేగంగా తొలగించడం ద్వారా ప్రజల్లో గందరగోళాన్ని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. సంబంధిత సోషల్ మీడియా కంపెనీలతో ప్రభుత్వం తుది చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు పూర్తయ్యాక అధికారిక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంధన ధరలు, సరఫరా, కొరత వంటి అంశాలపై వ్యాప్తి చెందుతున్న వదంతులు ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రమాదం ఉండటంతో, ఈ చర్యలు అత్యవసరంగా భావిస్తున్నారు.

ప్రభుత్వ వర్గాల ప్రకారం, తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, ధృవీకరించడం, తొలగించడం వంటి ప్రక్రియలను మరింత వేగవంతం చేయడంపై దృష్టి పెట్టబడింది. వదంతులను వ్యాప్తి చేసే పోస్టులను త్వరితగతిన అరికట్టడం ద్వారా ప్రజలకు సరైన సమాచారం చేరేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా సోషల్ మీడియా వేదికలపై నియంత్రణను మరింత కఠినతరం చేస్తూ, ముఖ్య రంగాలకు సంబంధించిన అపోహలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకునే దిశగా కదులుతోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us