
సంవత్సరానికి రూ.20 లక్షలు సంపాదించే వ్యక్తి కూడా ఆదాయ పన్ను చెల్లించకుండా ఉండొచ్చని చెబితే అది మొదట ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ నిపుణుల ప్రకారం సరైన సాలరీ స్ట్రక్చర్ ద్వారా ఇది కొన్ని పరిస్థితుల్లో సాధ్యమవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చిన తర్వాత, సంప్రదాయ మినహాయింపులు తగ్గినా, CTCలోని భాగాలను తెలివిగా ప్లాన్ చేస్తే పన్ను భారం గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విధంగా, ప్రామాణిక తగ్గింపుతో కలిపి సుమారు రూ.12.75 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉండే అవకాశం ఉంది. అయితే దీన్ని మరింత విస్తరించి రూ.20 లక్షల ప్యాకేజీపై కూడా పన్ను తగ్గించేందుకు ఉద్యోగి యజమాని కలిసి జీత నిర్మాణాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది.
ఉదాహరణకు రూ.20 లక్షల CTCలో కొత్త కార్మిక నియమాల ప్రకారం సుమారు 50 శాతం బేసిక్ సాలరీగా ఉంటుంది. మిగిలిన భాగంలో కొన్ని సౌకర్యాలను చేర్చడం ద్వారా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. అందులో ముఖ్యంగా కారు లీజింగ్ ఒక ప్రధాన అంశంగా చెప్పబడుతోంది. కంపెనీ ద్వారా కారు లీజ్ తీసుకుంటే, దానికి సంబంధించిన ఖర్చు ఉద్యోగి ట్యాక్సబుల్ ఇన్‌కమ్ నుంచి తగ్గుతుంది. అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో యజమాని వాటా కూడా కీలకం. సెక్షన్ 80CCD(2) ప్రకారం, బేసిక్ సాలరీలో 14 శాతం వరకు కంపెనీ NPSకు జమ చేస్తే అది అదనపు పన్ను మినహాయింపుగా పరిగణించబడుతుంది. దీనితో పాటు భోజన కూపన్లు, ప్రావిడెంట్ ఫండ్ (PF), రూ.75,000 ప్రామాణిక తగ్గింపు వంటి అంశాలు కూడా మొత్తం పన్ను భారాన్ని తగ్గిస్తాయి.
ఈ అన్ని అంశాలను కలిపి సరైన విధంగా ప్లాన్ చేస్తే, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.12 లక్షల కంటే తక్కువకు పడిపోవచ్చు. అప్పుడు పన్ను బాధ్యత పూర్తిగా సున్నా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే నిపుణులు ఒక విషయం స్పష్టం చేస్తున్నారు, ఇది ప్రతి ఒక్కరికీ ఆటోమేటిక్‌గా వర్తించదు. కంపెనీ పాలసీలు, జీత నిర్మాణం, వ్యక్తిగత పరిస్థితులపై ఇది ఆధారపడి ఉంటుంది. అందుకే ఉద్యోగం మార్చే సమయంలో లేదా ఇంక్రిమెంట్ సమయంలో హెచ్‌ఆర్‌తో ముందుగానే చర్చించడం కీలకం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి