దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్.. మన దేశంలో అద్భుతమైన ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇప్పటికే హ్యూందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తన ఐపీఓను ప్రారంభించేందుకు సిద్ధమైంది. అంతేకాక కంపెనీ నుంచి త్వరలో ఆవిష్కృతమయ్యే ఎలక్ట్రిక్ వాహనాలను ఇక్కడి నుంచి ఇతర మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశాలను అన్వేషిస్తుంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ఉత్పత్తి కేంద్రంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు కంపెనీ ఈ చర్యను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా హ్యూందాయ్ రానున్న రోజుల్లో మొత్తం నాలుగు ఈవీ మోడళ్లను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రణాళికల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
భవిష్యత్తులో నాలుగు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు హ్యూందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికం నాటికి ప్రముఖ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా ఇందులో ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు తాము చాలా బలమైన ఉత్పత్తి కేంద్రంగా ఉన్నామని, దానిని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తాము 80 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. ఈవీలు (ఎలక్ట్రిక్ వాహనాలు) విషయానికి వస్తే, ఇది కచ్చితంగా డిమాండ్‌పై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. భారతదేశంలో కంపెనీ ఏ ఉత్పత్తిని ఆఫర్ చేసినా, దానిని ఇతర మార్కెట్లకు ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో ఇక్కడ ప్రారంభించబోయే ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీ ఎగుమతి చేస్తుందా? అంటే అది డిమాండ్ పై ఆధారపడి ఉంటుందని గార్గ్ చెప్పారు. అలాగే ఈవీల ఎగుమతికి ఆయా దేశాల్లోని మౌలిక సదుపాయాలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. అయితే రానున్న కాలంలో ఈ విషయంలో ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఉత్పత్తులు ప్రధానంగా భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఉత్పత్తి చేస్తున్నామని, అయితే ఎగుమతులకు అవకాశాలను కూడా పరిశీలిస్తామని చెప్పారు.
సాధారణంగా భారతదేశంలో మనం ఏ ఉత్పత్తులను ఉత్పత్తి చేసినా ఆఫ్రికా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, మధ్య అమెరికా, ఆసియా వంటి వర్ధమాన మార్కెట్లకు చాలా అనుకూలంగా ఉంటాయని గార్గ్ అన్నారు. అందువల్ల, తాము ఈవీలను ఎగుమతి చేయడాన్ని పరిగణిస్తున్నామని చెబుతున్నారు. హ్యుందాయ్ కేవలం ఈవీలను తీసుకురావడమే కాకుండా మొత్తం పర్యావరణ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తోందని గార్గ్ చెప్పారు. కంపెనీ ప్రస్తుతం ఐయనిక్5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని దాదాపు రూ. 45 లక్షల ధరకు విక్రయిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..