
నేటి కాలంలో ఆధార్ కార్డు లేనిదే ఏ పనీ జరగదు. పిల్లల స్కూల్ అడ్మిషన్ల నుండి ప్రభుత్వ పథకాల వరకు బ్యాంక్ అకౌంట్ల నుండి పాన్ కార్డు వరకు ప్రతిదానికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరి. అయితే ఆధార్ ఎంత అవసరమో.. దానితో అంతే ప్రమాదం కూడా పొంచి ఉంది. మీ ఆధార్ వివరాలు గనుక సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే, మీ అనుమతి లేకుండానే మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బు మాయమయ్యే అవకాశం ఉంది. ఈ ముప్పు నుండి తప్పించుకోవడానికి ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఫీచర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
మనం ఆధార్ కార్డును దాదాపు అన్ని ఆర్థిక లావాదేవీలకు లింక్ చేస్తున్నాం. మన ఆధార్ డేటాలో పేరు, చిరునామాతో పాటు అత్యంత కీలకమైన వేలిముద్రలు, ఐరిస్ వివరాలు ఉంటాయి. సైబర్ దొంగలు ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ ద్వారా మన వేలిముద్రలను ఫోర్జరీ చేసి, బ్యాంక్ ఖాతాల నుండి డబ్బును దొంగిలిస్తున్నారు. మీరు మీ ఆధార్ డేటాను లాక్ చేయకపోతే, మీ బయోమెట్రిక్స్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.
మీ అనుమతి లేకుండా ఎవరూ మీ వేలిముద్రలను ఉపయోగించకుండా ఉండాలంటే.. UIDAI వెబ్‌సైట్‌లో మీ బయోమెట్రిక్ వివరాలను లాక్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ ఆధార్ సురక్షితంగా ఉంటుంది.
ఒక్కసారి లాక్ చేస్తే, మీ వేలిముద్రలు ఎక్కడా పని చేయవు. ఒకవేళ మీరు ఎక్కడైనా వేలిముద్ర వేయాల్సి వస్తే, మళ్ళీ ఇదే పద్ధతిలో క్షణాల్లో అన్‌లాక్ చేసుకోవచ్చు.