
ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు కొనాలంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్. మొబైల్ నుంచి టీవీ వరకు.. దుస్తుల నుంచి నిత్యావసర సరుకుల వరకు అన్నీ ఇంటి దగ్గరికే తెప్పించుకుంటున్నాం. పండుగల సమయంలో భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక సేల్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు కూడా అందిస్తుంటాయి. అయితే ఇన్ని ఆఫర్లు ఇస్తూ, డెలివరీ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తూ ఈ కంపెనీలు ఎలా సంపాదిస్తాయి? మనం కొనే ప్రతి వస్తువుపై వీటికి లాభం వస్తుందా..? నిజానికి ఈ కంపెనీల వ్యాపార విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వస్తువులు అమ్మడం మాత్రమే కాదు.. వాటిని అమ్మాలనుకునే వ్యాపారులకు సేవలు అందించడం ద్వారా కూడా భారీగా ఆదాయం సంపాదిస్తాయి.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వ్యాపారంలో ప్రధానమైనది మార్కెట్‌ప్లేస్ మోడల్. అంటే ఈ ప్లాట్‌ఫామ్‌లలో కనిపించే ప్రతి వస్తువును ఆయా కంపెనీలే కొనుగోలు చేసి అమ్మవు. వేలాది మంది వ్యాపారులు, బ్రాండ్లు తమ ఉత్పత్తులను ఈ వెబ్‌సైట్లలో లిస్ట్ చేస్తారు. ఉదాహరణకు ఒక వ్యాపారి రూ.20 వేల విలువైన మొబైల్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి పెట్టాడనుకుందాం. ఒక కస్టమర్ ఆ ఫోన్‌ను ఆర్డర్ చేస్తే.. అమ్మకం ద్వారా వచ్చిన మొత్తంలో నిర్ణయించిన ఫీజులు, కమీషన్లు ప్లాట్‌ఫామ్‌కు వెళ్తాయి. మిగిలిన మొత్తం నిబంధనల ప్రకారం విక్రేతకు చేరుతుంది. ఇక్కడ వస్తువును తయారు చేసింది ఒక కంపెనీ కావచ్చు. విక్రయిస్తున్నది మరో వ్యాపారి కావచ్చు. కానీ కొనుగోలుదారుడికి, అమ్మకందారుడికి మధ్య వారధిగా ఉండి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆదాయం సంపాదిస్తాయి.
ఈ కంపెనీలకు డబ్బులు తెచ్చిపెట్టే మరో ముఖ్యమైన మార్గం ప్రకటనలు. మీరు అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ కోసం వెతుకుతున్నారనుకుందాం. సెర్చ్ రిజల్ట్స్‌లో కొన్ని ఉత్పత్తులు మొదట కనిపిస్తాయి. వాటి పక్కన Sponsored అనే పదం కూడా ఉంటుంది. అంటే ఆ స్థానంలో తమ ఉత్పత్తులు కనిపించేందుకు సంబంధిత విక్రేతలు లేదా బ్రాండ్లు ప్లాట్‌ఫామ్‌కు డబ్బులు చెల్లిస్తుంటాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒక వస్తువు అమ్ముడుపోకపోయినా, దాని ప్రకటనను కస్టమర్లు క్లిక్ చేసినప్పుడు లేదా ప్రకటనకు నిర్దేశించిన విధంగా ఇంప్రెషన్లు వచ్చినప్పుడు ప్లాట్‌ఫామ్‌కు ఆదాయం వస్తుంది. అందుకే ఈ-కామర్స్ కంపెనీలకు ప్రకటనల వ్యాపారం చాలా కీలకంగా మారింది.
మనం ఆర్డర్ చేసిన వస్తువు ఇంటికి చేరాలంటే వెనుక చాలా పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది. గోదాముల్లో వస్తువులను నిల్వ చేయడం, ఆర్డర్ వచ్చిన తర్వాత ప్యాకింగ్ చేయడం, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం, చివరకు కస్టమర్‌కు అందించడం.. ఇలా ఎన్నో దశలుంటాయి. ఈ సేవలను కూడా విక్రేతలకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అందిస్తాయి. ఉదాహరణకు ఒక వ్యాపారికి దేశవ్యాప్తంగా డెలివరీ వ్యవస్థ లేకపోయినా.. ఈ ప్లాట్‌ఫామ్‌ల లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు. గోదాములలో వస్తువులు నిల్వ చేసుకోవచ్చు. ఆర్డర్ వచ్చినప్పుడు ప్యాకింగ్, డెలివరీ సేవలు పొందవచ్చు. వీటికి సంబంధించిన సేవా రుసుముల ద్వారా కంపెనీలకు ఆదాయం వస్తుంది.
అమెజాన్ ప్రైమ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. వార్షికంగా లేదా నెలవారీగా సభ్యత్వ రుసుము చెల్లించి వినియోగదారులు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. వేగవంతమైన డెలివరీ ప్రయోజనాలు, ప్రైమ్ వీడియో, ఇతర డిజిటల్ కంటెంట్ సేవలు ఇందులో భాగంగా ఉంటాయి. లా ఒకసారి కస్టమర్ సభ్యత్వం తీసుకుంటే నిర్ణీత కాలానికి కంపెనీకి ఆదాయం వస్తుంది. అంతేకాదు, సభ్యత్వం ఉన్నవారు అదే ప్లాట్‌ఫామ్‌లో మరిన్ని కొనుగోళ్లు చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఇక్కడే అసలు వ్యాపార వ్యూహం ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలు పండుగల సమయంలో భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. కొన్ని వస్తువులపై క్యాష్‌బ్యాక్‌లు, బ్యాంక్ ఆఫర్లు కూడా ఇస్తాయి. ని వెనుక ప్రధాన ఉద్దేశం ఎక్కువ మంది కస్టమర్లను తమ ప్లాట్‌ఫామ్‌కు ఆకర్షించడం. ఒకసారి కస్టమర్ అలవాటు పడితే భవిష్యత్తులో కూడా అక్కడే కొనుగోళ్లు చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఆర్డర్లు వస్తే విక్రేతల సంఖ్య పెరుగుతుంది. ప్రకటనలు ఇచ్చే బ్రాండ్లు పెరుగుతాయి. లాజిస్టిక్స్, ఇతర సేవల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఆర్డర్‌పై లాభం వస్తుందని కాదు. డెలివరీ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు, టెక్నాలజీ నిర్వహణ, మార్కెటింగ్, డిస్కౌంట్లు వంటి వాటికి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి ఉదాహరణగా ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ FY25లో రూ.20,493 కోట్ల నిర్వహణ ఆదాయం పొందినప్పటికీ, రూ.1,494 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంటే భారీ ఆదాయం ఉన్నంత మాత్రాన కంపెనీకి నికర లాభాలు వస్తాయని అనుకోవడానికి వీల్లేదు.