Home Loan: వారికి హోమ్ లోన్‌ కష్టమేమీ కాదు.. ఇలా చేస్తే సింపుల్‌గా అకౌంట్‌లోకి డబ్బు..

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల స్వప్నం. కానీ ఉద్యోగ బాధ్యతలు, పిల్లల చదువుల హడావిడిలో పడి చాలా మందికి 60 ఏళ్లు వచ్చేవరకు ఆ కల తీరదు. తీరా తీరిక దొరికాక.. ఈ వయసులో మనకు లోన్ వస్తుందా? బ్యాంకులు అప్పు ఇస్తాయా? అనే డౌట్ వారిని వెంటాడుతుంది. అయితే దానికి కొన్ని మార్గాలున్నాయి..

Home Loan: వారికి హోమ్ లోన్‌ కష్టమేమీ కాదు.. ఇలా చేస్తే సింపుల్‌గా అకౌంట్‌లోకి డబ్బు..
Home Loans For Senior Citizens

Updated on: Feb 15, 2026 | 11:18 AM

సాధారణంగా 60 ఏళ్లు దాటి రిటైర్ అయ్యాక బ్యాంకులు లోన్లు ఇవ్వవని చాలామంది భావిస్తుంటారు. ముఖ్యంగా పెరుగుతున్న ధరల దృష్ట్యా రిటైర్మెంట్ తర్వాత సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, కొనాలన్నా హోమ్ లోన్ దొరకడం కష్టమని వెనకడుగు వేస్తుంటారు. అయితే సీనియర్ సిటిజన్లకు హోమ్ లోన్ రాదు అనేది కేవలం ఒక అపోహ మాత్రమే. కొన్ని కఠిన నిబంధనలకు లోబడి.. 60 ఏళ్లు పైబడిన వారు కూడా హోమ్ లోన్ పొందవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వయస్సు –  కాలపరిమితి

హోమ్ లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంకులు ప్రధానంగా వయస్సును పరిగణనలోకి తీసుకుంటాయి. యువకులకు 20 నుండి 30 ఏళ్ల కాలపరిమితితో లోన్ ఇస్తాయి. కానీ సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే రుణ కాలపరిమితి ముగిసే సమయానికి దరఖాస్తుదారుడి వయస్సు 70 నుండి 75 ఏళ్లకు మించకూడదు. ఉదాహరణకు.. మీకు 60 ఏళ్లు ఉంటే, బ్యాంకులు మీకు గరిష్టంగా 10 ఏళ్ల కాలపరిమితితో మాత్రమే లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది.

ఆదాయ వనరులు ముఖ్యం

60 ఏళ్ల వయసులో భవిష్యత్తు ఆదాయం కంటే ప్రస్తుత ఆదాయ స్థిరత్వాన్ని బ్యాంకులు గమనిస్తాయి. ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగం నుండి వచ్చే పెన్షన్ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. అద్దెలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలు లేదా ఇతర పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం మీ లోన్ అర్హతను పెంచుతాయి.

క్రెడిట్ స్కోర్

60 ఏళ్ల వయసులో మీ క్రెడిట్ స్కోర్ చాలా కీలకం. మీ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, బ్యాంకులు సులభంగా లోన్ ఇవ్వడమే కాకుండా తక్కువ వడ్డీ రేటును కూడా ఆఫర్ చేస్తాయి. గతంలో లోన్ ఎగవేతలు లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలు ఉంటే లోన్ రావడం కష్టమవుతుంది.

లోన్ త్వరగా రావాలంటే..

ఒంటరిగా లోన్ కోసం దరఖాస్తు చేసే కంటే కో అప్లికెంట్‌ను చేర్చుకోవడం ఉత్తమం. సంపాదన ఉన్న మీ పిల్లలను లేదా జీవిత భాగస్వామిని లోన్‌లో భాగస్వామిగా చేస్తే, లోన్ అమౌంట్ పెరగడమే కాకుండా ఎక్కువ కాలపరిమితి పొందే అవకాశం ఉంటుంది. దీనివల్ల నెలవారీ ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది.

రిటైర్మెంట్ తర్వాత లోన్ తీసుకోవడం ఒక సాహసమే అయినా సరైన ప్రణాళిక ఉంటే అది సాధ్యమే. మీ నెలవారీ ఖర్చులు, అత్యవసర నిధిని పక్కన పెట్టి, హాయిగా ఈఎంఐ చెల్లించగలిగే సామర్థ్యం ఉంటేనే లోన్ తీసుకోవడం మంచిది. మనశ్శాంతితో కూడిన సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ఇవే సరైన మార్గాలు.