New House: కొత్త ఇల్లు కొంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి భయ్యా

New House Buying Checklist: సొంత ఇల్లు కొనుగోలు చేయడం జీవితంలో ఒక కీలక నిర్ణయం. మరీ ముఖ్యంగా అపార్ట్‌మెంట్ లేదా గేటెడ్ కమ్యునిటీల్లో ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు కొన్ని కీలక అంశాలను సరిగ్గా పరిశీలించుకోవాలి. బడ్జెట్, లీగల్ డాక్యుమెంట్లు తదితర కీలక అంశాలను ముందుగానే పరిశీలిస్తే భవిష్యత్తులో ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందులను నివారించవచ్చు. కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే.

New House: కొత్త ఇల్లు కొంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి భయ్యా
House Buying Tips

Updated on: Jul 11, 2026 | 1:22 PM

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. అయితే సరైన అవగాహన లేకుండా కొత్త ఇళ్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కొత్త ఇళ్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు కొన్ని కీలక అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. ఈ విషయంలో సరైన అవగాహన లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఆ తర్వాత నష్టపోవాల్సి ఉంటుంది. కొత్త ఇళ్లు ముందు ఏయే అంశాలను పరిశీలించాలో తెలుసుకోండి.

1. బడ్జెట్‌తో పాటు అదనపు ఖర్చులను కూడా లెక్కించండి

ఇంటి ధర మాత్రమే కాదు, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ, కార్ పార్కింగ్ ఛార్జీలు, మెయింటెనెన్స్ డిపాజిట్, క్లబ్ హౌస్ ఫీజులు వంటి అదనపు ఖర్చులను కూడా మీ బడ్జెట్‌లో చేర్చాలి. మొత్తం ఖర్చు ఎంత అవుతుందో ముందుగానే అంచనా వేసుకుని, తదనుకునంగా ప్లాన్ చేసుకుంటే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.

2. సరైన లొకేషన్‌ను ఎంపిక చేసుకోండి

ఇంటి లొకేషన్ భవిష్యత్తులో మీ జీవన నాణ్యతను నిర్ణయిస్తుంది. ఆఫీస్, పిల్లల స్కూల్, కాలేజీ, ఆస్పత్రులు, మార్కెట్లు, బ్యాంకులు వంటి అవసరమైన సదుపాయాలు దగ్గరలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. అలాగే మెట్రో, బస్సు, రైల్వే వంటి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా? లేవా? చెక్ చేసుకోవాలి. ఇవేవీ సరిగ్గా చూసుకోకుండా మారుమూల ప్రాంతంలో ఇంటిని కొంటే ఎదురయ్యే అసౌకర్యాల గురించి అవగాహన కలిగి ఉండాలి.

ఇవి కూడా చదవండి

3. లీగల్ డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలించండి

ఇంటి కొనుగోలు చేసే ముందు పేరెంట్ డాక్యుమెంట్లు, సేల్ డీడ్, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ (EC), పట్టాదారు పత్రాలు, పన్నుల చెల్లింపు రికార్డులు వంటి అన్ని పత్రాలను ఆ రంగంలో అనుభవజ్ఞుడైన న్యాయవాది ద్వారా పరిశీలించాలి. ఆస్తిపై ఎలాంటి వివాదాలు లేదా కోర్టు కేసులు లేవని నిర్ధారించుకోవాలి.

4. అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో లేదో చూడండి

ప్రాజెక్టుకు HMDA, DTCP లేదా స్థానిక మున్సిపల్ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు ఉన్నాయా అనే విషయాన్ని ధృవీకరించాలి. ఆమోదించిన ప్లాన్ ప్రకారమే నిర్మాణం జరుగుతోందా లేదా కూడా పరిశీలించాలి.

5. RERA రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చెక్ చేయండి

ప్రాజెక్ట్ RERAలో నమోదు అయి ఉందా? లేదా? చెక్ చేసుకోవాలి. దీంతో బిల్డర్ నిర్ణీత గడువులోగా ఇంటిని అప్పగించాల్సిన బాధ్యత ఉంటుంది. ఏవైనా సమస్యలు తలెత్తితే చట్టపరమైన రక్షణ కూడా లభిస్తుంది.

6. బిల్డర్ నమ్మకాన్ని అంచనా వేయండి

బిల్డర్ గతంలో నిర్మించిన ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టుల నిర్మాణ నాణ్యతను పరిశీలించాలి. గతంలో బిల్డర్ ఇచ్చిన గడువు లోపు ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారా? లేదా? అనే అంశంపై గతంలో ఇళ్లు కొనుగోలు చేసిన వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి. నమ్మకమైన బిల్డర్‌ను ఎంచుకోవడం అత్యంత ముఖ్యం. ప్రాజెక్టును ఏవో సాకులతో అర్థాంతరంగా ఆపేస్తే అవస్థలుపడాల్సి ఉంటుంది.

7. కార్పెట్ ఏరియా ఎంత ఉందో తెలుసుకోండి

బిల్డర్లు చెప్పే సూపర్ బిల్ట్-అప్ ఏరియాతో పాటు మీరు నిజంగా ఉపయోగించుకునే కార్పెట్ ఏరియా ఎంత ఉందో తెలుసుకోవాలి. చదరపు అడుగుకు చెల్లిస్తున్న ధరను కార్పెట్ ఏరియాతో పోల్చి నిర్ణయం తీసుకోవడం మంచిది.

8. హోమ్ లోన్ అర్హతను ముందుగానే తెలుసుకోండి

మీ CIBIL స్కోర్ ఆధారంగా బ్యాంకు ఎంత వరకు రుణం మంజూరు చేస్తుందో ముందుగానే తెలుసుకోవాలి. అలాగే మీరు కొనుగోలు చేస్తున్న ప్రాజెక్టుకు ప్రముఖ బ్యాంకుల నుంచి లోన్ ఆమోదం ఉందా లేదా కూడా పరిశీలించాలి.

9. ప్రాథమిక వసతులు పరిశీలించండి

ప్రాజెక్టులో తాగునీటి సౌకర్యం, విద్యుత్ బ్యాకప్, లిఫ్టులు, పార్కింగ్, సెక్యూరిటీ, డ్రైనేజీ, వ్యర్థాల నిర్వహణ, పిల్లల ఆట స్థలం వంటి సౌకర్యాలు ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. ఇవి భవిష్యత్తులో మీ జీవన సౌకర్యాన్ని ప్రభావితం చేస్తాయి.

10. భవిష్యత్తులో రీసేల్ విలువను కూడా ఆలోచించండి

ఇల్లు కొనుగోలు చేసే సమయంలో కేవలం ప్రస్తుత అవసరం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఆ ప్రాంతానికి డిమాండ్ ఎలా ఉంటుందో కూడా పరిశీలించాలి. మెట్రో, ఐటీ కారిడార్, విద్యాసంస్థలు లేదా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు సాధారణంగా మంచి రీసేల్, రెంటల్ విలువ ఉంటుంది.

ఇల్లు కొనుగోలు చేయడం జీవితంలో ఒక పెద్ద పెట్టుబడి. అందువల్ల తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే.. ఇక్కడ ఇచ్చిన కీలక అంశాలను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో అనవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు. సరైన ప్రణాళిక, చట్టపరమైన ధృవీకరణ, నమ్మకమైన బిల్డర్ ఎంపికతో మీ సొంత ఇంటి కలను సురక్షితంగా సాకారం చేసుకోవచ్చు.

Follow Us