
Mobile Alert: ఈ మధ్య కాలంలో మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మోగడం లేదా స్క్రీన్‌పై ఒక వింత మెసేజ్ కనిపించడం జరిగిందా? అలా జరిగితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ పరీక్షలో భాగం మాత్రమే. ఈ అలర్ట్ అలారం మెసేజ్‌లు మే 2వ తేదీన ఉదయం 11 గంటల నుంచి ఎప్పుడైనా రావచ్చు. అయితే ఈ సైరన్ అలర్ట్ ఇది వరకు కూడా చాలా మందికి వచ్చాయి. అలాంటి వారు కూడా భయపడాల్సిన అవసరం లేదు.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA), డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) సంయుక్తంగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం ‘సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్’ (C-DOT) అభివృద్ధి చేసిన SACHET అనే ప్లాట్‌ఫారమ్‌ను వాడుతున్నారు.
మనం సాధారణంగా పంపే మెసేజ్‌లలా కాకుండా, ఇది సెల్ బ్రాడ్కాస్ట్ (Cell Broadcast) సాంకేతికతపై పనిచేస్తుంది. నెట్‌వర్క్ రద్దీగా ఉన్నా సరే, సెకన్ల వ్యవధిలో నిర్ణీత ప్రాంతంలోని మొబైల్ వినియోగదారులందరికీ ఇది చేరుతుంది. తుఫానులు, భూకంపాలు, సునామీలు లేదా గ్యాస్ లీకేజీల వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను తక్షణమే అప్రమత్తం చేయడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం.
ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవలో భాగంగా ఈ వ్యవస్థను పూర్తిగా మన దేశంలోనే రూపొందించారు. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా, మన సొంత టెలికాం మౌలిక సదుపాయాలతో దీనిని C-DOT సిద్ధం చేసింది.
దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థను అధికారికంగా ప్రారంభించే ముందు, దాని పనితీరును, విశ్వసనీయతను తనిఖీ చేయడానికి ప్రస్తుతం ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. అందుకే వినియోగదారులకు ఇంగ్లీష్, హిందీతో పాటు వారి ప్రాంతీయ భాషల్లో (తెలుగులో కూడా) మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ అలర్ట్ కేవలం టెస్టింగ్ మాత్రమే. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వం చేపట్టిన ఒక గొప్ప ముందడుగు ఇది. అందుకే నిర్భయంగా ఉండండి.