
బంగారానికి కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చని మీకు తెలుసా? అవును.. మనం కారు, ఇల్లు, ఆరోగ్యానికి బీమా తీసుకున్నట్లే బంగారు ఆభరణాలకు కూడా ప్రత్యేక బీమా సదుపాయాలు ఉన్నాయి. కొన్ని హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలకు యాడ్-ఆన్‌గా కూడా నగలకు రక్షణ పొందవచ్చు. మరి బంగారం పోతే ఇన్సూరెన్స్ కంపెనీ నిజంగానే డబ్బులు చెల్లిస్తుందా? ఏ సందర్భాల్లో పరిహారం లభిస్తుంది? తెలుసుకుందాం.
బంగారు నగలకు ప్రధానంగా రెండు మార్గాల్లో బీమా పొందవచ్చు.
1. ప్రత్యేక జ్యువెలరీ ఇన్సూరెన్స్: బంగారు ఆభరణాలకు ప్రత్యేకంగా బీమా తీసుకోవచ్చు. ఇందులో పాలసీ నిబంధనలను బట్టి దొంగతనం, దోపిడీ, అగ్నిప్రమాదం, ప్రమాదవశాత్తు నష్టం వంటి వాటికి రక్షణ ఉంటుంది.
2. హోమ్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్: ఇంటి బీమాకు అదనంగా బంగారు నగల రక్షణను జోడించుకోవచ్చు. ఉదాహరణకు HDFC ERGO హోమ్ షీల్డ్ పాలసీలో అదనపు ప్రీమియం చెల్లించి జ్యువెలరీ కవర్ పొందే అవకాశం ఉంది
ఉదాహరణకు మీ దగ్గర రూ.5 లక్షల విలువైన బంగారు నగలు ఉన్నాయనుకుందాం. వాటికి తగిన బీమా తీసుకున్నారు. ఒకవేళ పాలసీలో కవర్ చేసిన దొంగతనం కారణంగా నగలు పోతే, ఇన్సూరెన్స్ కంపెనీ విచారణ జరిపి నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తుంది.
అయితే మీరు కొనుగోలు చేసిన బంగారం మొత్తం విలువను ప్రతిసారీ తిరిగి చెల్లిస్తారని అనుకోకూడదు. బీమా మొత్త పరిమితి, నగల విలువ, డిడక్టిబుల్, పాలసీ నిబంధనలను బట్టి పరిహారం మారుతుంది.
బంగారం కొనుగోలు చేసిన బిల్లులు.
నగల విలువను తెలిపే వాల్యుయేషన్ సర్టిఫికెట్.
నగల ఫొటోలు.
గుర్తింపు పత్రాలు.
బీమా దరఖాస్తు వివరాలు.
నగల విలువను అంచనా వేయించి, ఎంత మొత్తానికి బీమా కావాలో నిర్ణయించుకోవాలి.
ముందుగా దొంగతనం లేదా దోపిడీ జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి.
పోలీస్ ఎఫ్ఐఆర్, బంగారం బిల్లులు, పాలసీ పత్రాలు సమర్పించాలి.
ఇన్సూరెన్స్ కంపెనీ సర్వేయర్ విచారణ జరుపుతారు.
ఇక్కడే అసలు విషయం ఉంది. బంగారం పోయిన ప్రతిసారీ ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వదు.
పాలసీలో కవర్ చేయని కారణాలతో నగలు పోతే.
బిల్లులు, యాజమాన్య ఆధారాలు లేకపోతే.
పాలసీలో పేర్కొన్న పరిమితులకు మించి నష్టం జరిగితే.
నగలు కనిపించడం లేదని మాత్రమే చెప్పి, దొంగతనం జరిగినట్లు ఆధారాలు లేకపోతే.
పాలసీలో ప్రత్యేకంగా మినహాయించిన సందర్భాల్లో.
ఉదాహరణకు కొన్ని పాలసీల్లో అనుమానాస్పదంగా నగలు కనిపించకుండా పోవడాన్ని (Mysterious Disappearance) కవర్ చేయరు.
బంగారం కొనుగోలు చేసిన వెంటనే దాని బిల్లును భద్రపరచుకోవాలి. నగల ఫొటోలు, బరువు, స్వచ్ఛత వివరాలను కూడా ఉంచుకోవాలి. బీమా తీసుకునేటప్పుడు ఇంట్లో ఉన్న నగలన్నింటినీ పాలసీలో చేర్చారా లేదా అనేది పరిశీలించాలి. కేవలం హోమ్ ఇన్సూరెన్స్ తీసుకున్నంత మాత్రాన ఇంట్లోని బంగారం మొత్తం ఆటోమేటిక్‌గా బీమా పరిధిలోకి రాదు.
గమనిక: బంగారు ఆభరణాలకు బీమా తీసుకోవడం సాధ్యమే. అయితే పాలసీని కొనుగోలు చేసే ముందు కవరేజ్, మినహాయింపులు, క్లెయిమ్ నిబంధనలను పూర్తిగా చదవాలి.