
ఈ పండుగ సీజన్‌లో బంగారం, వెండి ధరలు దేశీయ మార్కెట్లలో మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత వారం రోజుల్లో వెండి ధరలు భారీగా పెరగ్గా, బంగారం ఏడాది వ్యవధిలోనే ఏకంగా 65 శాతం మేర లాభపడింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్‌లో వెండి ధరలు ఒక్క వారంలో కిలోకు రూ.10,000 కంటే ఎక్కువ పెరిగి, ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చాయి. డిసెంబర్ 5, 2025న గడువు ముగిసే కాంట్రాక్టుల ధర పెరగడం ఈ పెరుగుదలను స్పష్టంగా సూచిస్తోంది.
గత దీపావళి, ధంతేరాస్ పండుగల నుండి ఇప్పటివరకు బంగారం, వెండి ధరలలో వచ్చిన పెరుగుదల చాలా తీవ్రంగా ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు స్పాట్ మార్కెట్‌లో కూడా ధరల పెరుగుదల గమనించవచ్చు. గతేడాది దీపావళి సమయంలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.80,000 వద్ద ఉండగా ఇది ఇప్పుడు 10 గ్రాములకు రూ.1,30,000 కంటే ఎక్కువగా పెరిగింది. ఇది దాదాపు 60 శాతం పెరుగుదలను సూచిస్తుంది. అదేవిధంగా 2024లో వెండి ధరలు కిలోకు రూ.98,000 వద్ద ఉంటే, ప్రస్తుతం కిలోకు రూ.1,80,000 దాటింది.ఇది సుమారు 55 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
MCXలో వెండి ధరల పెరుగుదలను పరిశీలిస్తే.. గత వారం చివరి ట్రేడింగ్ రోజు అయిన అక్టోబర్ 10 శుక్రవారం నుండి ఈ వారం శుక్రవారం వరకు గణనీయమైన మార్పు కనిపించింది. 10న కిలో వెండి ధర ట్రేడ్ ముగిసే సమయానికి రూ.1,46,466 వద్ద ముగిసింది. అయితే అక్టోబర్ 17 శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి వెండి కిలోకు రూ.1,56,604కి చేరుకుంది. మొత్తంమీద వెండి ధరలు ఒక్క వారంలో రూ.10,138 లాభంతో ముగిశాయి.
బంగారం ధరలు గత సంవత్సరంతో పోలిస్తే భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతేడాది అక్టోబర్ 31న దీపావళి నాడు, బంగారం ధర 10 గ్రాములకు రూ.78,430గా ఉంది. కానీ అక్టోబర్ 16న మార్కెట్ ముగిసే సమయానికి ఇది 10 గ్రాములకు రూ.1,29,852కి పెరిగింది. ఇది కేవలం ఏడాదిలో రూ.51,422 పెరుగుదలను సూచిస్తుంది. ఇంకా అక్టోబర్ 17న ట్రేడింగ్ సమయంలో బంగారం ధరలు మరో రూ.2,442 పెరిగి 10 గ్రాములకు రూ.1,32,294కి చేరుకుంది. ఇది ఆల్ టైమ్ హైగా నమోదు అయ్యింది. పండుగల వేళ ఈ పెరుగుదల కొనుగోలుదారులకు కొంత ఆందోళన కలిగించినా, పెట్టుబడిదారులు మాత్రం దీన్ని లాభదాయకంగా చూస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..