ఎలాన్ మస్క్ గెంటేస్తే.. అంతే స్పీడ్‌తో ఎదిగాడు! ప్రపంచానికి తెలియని పరాగ్ సక్సెస్ స్టోరీ

ట్విట్టర్‌ మాజీ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ ఏఐ స్టార్టప్‌తో టెక్‌ రంగంలోకి తిరిగి వచ్చారు. 2023లో స్థాపించిన ప్యారలల్‌ వెబ్‌ సిస్టమ్స్‌ విలువ సుమారు 2 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు సమాచారం. ఐఐటీ బొంబాయి, స్టాన్‌ఫోర్డ్‌ విద్యాభ్యాసం అనంతరం ట్విట్టర్‌లో ఇంజినీర్‌గా చేరి సీఈఓగా ఎదిగిన అగర్వాల్‌, ఇప్పుడు ఏఐ మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తున్నారు.

ఎలాన్ మస్క్ గెంటేస్తే.. అంతే స్పీడ్‌తో ఎదిగాడు! ప్రపంచానికి తెలియని పరాగ్ సక్సెస్ స్టోరీ
Elon Musk And Parag Agrawal

Updated on: Aug 27, 2026 | 10:11 AM

ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థ నుంచి వైదొలిగిన ఆయన.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. 2023లో ఆయన స్థాపించిన ‘ప్యారలల్ వెబ్ సిస్టమ్స్’ అనే ఏఐ స్టార్టప్ ప్రస్తుతం భారీగా దూసుకెళ్తున్నట్లు సమాచారం. కంపెనీ విలువ సుమారు 2 బిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదికలు వెల్లడించాయి.

AI మౌలిక సదుపాయాలపై ప్రధాన దృష్టి

ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ ప్రధానంగా ఏఐ అప్లికేషన్లు, భారీ స్థాయి కంప్యూటింగ్ వర్క్‌లోడ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. ఏఐ వినియోగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, అధిక సామర్థ్యంతో పనిచేసే కంప్యూటింగ్ వ్యవస్థలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే లక్ష్యంతో అగర్వాల్ సంస్థను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రారంభించిన రెండేళ్లలోనే కంపెనీ పెట్టుబడిదారుల నుంచి గణనీయమైన ఆసక్తిని ఆకర్షించింది. బహిరంగంగా వెల్లడైన నిధుల సమాచారాన్ని ఆధారంగా చేసుకున్న నివేదికల ప్రకారం, స్టార్టప్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్లు సమాచారం.

IIT బాంబే నుంచి స్టాన్‌ఫోర్డ్‌ వరకు

పరాగ్ అగర్వాల్ టెక్ ప్రస్థనం ఉన్నత విద్యతో ప్రారంభమైంది. జేఈఈలో ఆల్‌ ఇండియా 77వ ర్యాంకు సాధించిన ఆయన ఐఐటీ బొంబాయిలో కంప్యూటర్ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ చదివారు. బీటెక్‌ అనంతరం అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పీహెచ్‌డీ సమయంలో మైక్రోసాఫ్ట్‌, యాహూ, ఏటీ&టీ ల్యాబ్స్‌లో రీసెర్చ్‌ ఇంటర్న్‌గా పనిచేశారు. ఈ అనుభవం ద్వారా డిస్ట్రిబ్యూటెడ్‌ సిస్టమ్స్‌, లార్జ్‌-స్కేల్‌ కంప్యూటింగ్‌పై ఆయనకు లోతైన అవగాహన ఏర్పడింది.

ట్విట్టర్‌లో ఇంజినీర్‌గా మొదలు

2011లో ట్విట్టర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరిన అగర్వాల్‌ క్రమంగా సంస్థలో ఉన్నత స్థానాలకు ఎదిగారు. 2017లో కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (CTO)గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం నవంబర్‌ 2021లో జాక్‌ డోర్సీ స్థానంలో ట్విట్టర్‌ సీఈఓగా నియమితులయ్యారు. అయితే ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత 2022 అక్టోబర్‌లో అగర్వాల్‌ సీఈఓ పదవీకాలం ముగిసింది. మస్క్‌ సంస్థను తన ఆధీనంలోకి తీసుకున్న వెంటనే అప్పటి టాప్‌ లీడర్‌షిప్‌లోని పలువురిని తొలగించారు.

CEO నుంచి స్టార్టప్ వ్యవస్థాపకుడిగా

ట్విట్టర్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో కార్పొరేట్‌ నాయకత్వ పదవిని చేపట్టకుండా అగర్వాల్‌ స్వయంగా కంపెనీని నిర్మించేందుకు మొగ్గుచూపారు. భారీ స్థాయి కంప్యూటింగ్‌, ఏఐ మౌలిక సదుపాయాలపై తన అనుభవాన్ని ఉపయోగిస్తూ ప్యారలల్‌ వెబ్‌ సిస్టమ్స్‌ను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐపై పెట్టుబడులు పెరుగుతున్న సమయంలో ఆయన కొత్త వెంచర్‌ తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంజినీరింగ్‌, పరిశోధన, కార్పొరేట్‌ నాయకత్వం నుంచి ఇప్పుడు ఏఐ వ్యవస్థాపకుడిగా మారిన అగర్వాల్‌ ప్రయాణం టెక్‌ రంగంలో కొత్త అవకాశాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us