వారెవ్వా.. రూ.11కే ఫ్లైట్ టికెట్.. హైదరాబాద్ నుంచి ఈ దేశానికి ఇలా ఎగిరిపోవచ్చు..

రూ.10కి చాయ్ కూడా రావడం లేదు. కానీ ఓ విమాన సంస్థ ఏకంగా విదేశాలకే టికెట్ అందిస్తుంది. విదేశీ విమానయాన సంస్థ వియట్‌జెట్ ఈ అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. భారత్ నుంచి వియత్నాంకు వెళ్లడానికి టికెట్ ధర కేవలం రూ.11 మాత్రమే. ఈ బంపర్ ఆఫర్‌లో టికెట్లు బుక్ చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. ఆలస్యం చేయకుండా వెంటనే టికెట్లను బుక్ చేసుకోండి..

వారెవ్వా.. రూ.11కే ఫ్లైట్ టికెట్.. హైదరాబాద్ నుంచి ఈ దేశానికి ఇలా ఎగిరిపోవచ్చు..
Vietjet Rs 11 Ticket Offer

Updated on: Oct 31, 2025 | 12:51 PM

దేశీయ విమానయాన సంస్థలు అందించలేని అద్భుతమైన ఆఫర్‌తో విదేశీ ఎయిర్‌లైన్ వియట్‌జెట్ వార్తల్లో నిలిచింది. దేశంలోని అనేక ప్రధాన నగరాల నుండి వియత్నాంకు వెళ్లడానికి కేవలం రూ.11బేస్ ఫేర్‌తో విమాన టిక్కెట్లను అందిస్తోంది. ఈ ప్రత్యేక ప్రమోషన్ ద్వారా భారతీయ ప్రయాణికులు అతి తక్కువ ధరకే వియత్నాం అందాలను చుట్టిరావచ్చు. ఈ రూ.11 అనేది బేస్ ఫేర్ మాత్రమే.. దీనికి అదనంగా పన్నులు, ఎయిర్ పోర్టు ఛార్జీలు ఉంటాయి.

ఈ డిస్కౌంట్‌ టికెట్2ను అక్టోబర్ 29 నుండి అక్టోబర్ 31వరకు బుక్ చేసుకోవచ్చు. అంటే ఇవాళే చివరి రోజు అన్నమాట. కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఆలస్యం చేయకుండా వెంటనే టికెట్ బుక్ చేసుకోవడం బెటర్. ఈ టికెట్‌తో డిసెంబర్ 1నుండి మే 27 మధ్య ప్రయాణించొచ్చు. టిక్కెట్లను www.vietjetair.com వెబ్‌సైట్ లేదా Vietjet Air మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఈ ఆఫర్ కింద దేశంలోని ఆరు ప్రధాన నగరాల నుండి వియత్నాంలోని ముఖ్య గమ్యస్థానాలకు టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి నుంచి.. హనోయ్, హో చి మిన్ సిటీ, డా నాంగ్‌ వంటి నగరాలకు కేవలం రూ.11కే వెళ్లొచ్చు. ఎకానమీ క్లాస్ ఆఫర్‌తో పాటు వియట్‌జెట్ సంస్థ బిజినెస్, స్కైబాస్ క్లాస్ టిక్కెట్లపై కూడా డిస్కౌంట్‌ను అందిస్తోంది. ప్రతి నెల 2, 20వ తేదీలలో బుక్ చేసుకునే వారికి ఈ క్లాసుల్లో 20శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ ఏడాది పొడవునా చెల్లుతుంది.

వియత్నాంకు ఎందుకంటే..

వియత్నాం అద్భుతమైన సహజ సౌందర్యానికి, గొప్ప చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. వియత్‌జెట్ అందిస్తున్న ఈ చౌక టిక్కెట్ల ఆఫర్‌ను ఉపయోగించుకుని.. మీరు హనోయ్, హ్యూ, నిన్హ్ బిన్హ్ యొక్క చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు. అక్కడి సుందరమైన బీచ్‌లను ఆస్వాదించవచ్చు. తక్కువ బడ్జెట్‌లో విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..