
మార్కెట్‌లో అస్థిరత పెరుగుతున్న సమయంలో చాలా మంది పెట్టుబడిదారులు ఇప్పుడు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా స్థిరమైన రాబడి, మూలధన భద్రత, నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి మార్గంగా కొనసాగుతున్నాయి. 2026లో బ్యాంకులు అందిస్తున్న FD వడ్డీ రేట్లు 5.75 శాతం నుంచి 7.75 శాతం వరకు ఉండగా, కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు 8.10 శాతం వరకు వడ్డీ అందిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు అధిక వడ్డీ లభిస్తోంది.
రూ.1 లక్షను FDలో పెట్టుబడి పెట్టి నెలవారీ వడ్డీ ఎంపికను ఎంచుకుంటే, ప్రతి నెలా స్థిర ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వడ్డీ రేటును బట్టి సాధారణ ఖాతాదారులకు నెలకు సుమారు రూ.479 నుంచి రూ.554 వరకు ఆదాయం రావచ్చు. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ 5.75 శాతం వడ్డీతో నెలకు సుమారు రూ.479 అందించగలదు. ICICI, HDFC బ్యాంక్‌లు 6.25 శాతం వడ్డీతో నెలకు సుమారు రూ.521 వరకు ఇవ్వవచ్చు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 6.50 శాతం వడ్డీతో దాదాపు రూ.542 అందిస్తుండగా, ఎస్ బ్యాంక్ 6.65 శాతం వడ్డీతో నెలకు సుమారు రూ.554 ఇవ్వగలదు.
సీనియర్ సిటిజన్లకు వడ్డీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఎస్ బ్యాంక్ 7.75 శాతం వడ్డీతో నెలకు సుమారు రూ.646 వరకు ఆదాయం అందించే అవకాశం ఉంది. ఇక చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.10 శాతం వరకు వడ్డీ అందిస్తున్నాయి. అలాగే శివాలికా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా అధిక FD రేట్లతో ఆకర్షిస్తున్నాయి. అయితే పెట్టుబడి పెట్టే ముందు వడ్డీ రేట్లు మాత్రమే కాకుండా, ముందస్తు ఉపసంహరణ నిబంధనలు, పన్ను తర్వాత వచ్చే రాబడులు, బ్యాంకు విశ్వసనీయత వంటి అంశాలను కూడా పరిశీలించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి