
కూతురు కోరుకుంటే ఏదైనా ఇచ్చేస్తారా? ప్రాణం తప్ప ఏదైనా ఇచ్చేస్తాను.. ఎందుకంటే దాని తర్వాత కోరికలు తీర్చడానికి నేను ఉండాలి కదా! ఈ తెలుగు సినిమా డైలాగ్‌ను ఓ దుబాయ్ షేక్ నిజం చేసి చూపించాడు. తన చిన్నారి కూతురి కోరుకుందని కేవలం ఓ 5 నిమిషాల్లోనే ఏకంగా 3.85 కోట్లు మంచినీళ్లలా ఖర్చు పెట్టాడు. అది కూడా దేని కోసమో తెలిస్తే మరింత షాక్ అవుతారు. ఒక డేగ కోసం. ఎస్.. మీరు చదివింది నిజమే. కూతురు కోరుకున్న అరుదైన తెల్ల డేగను వేలంలో రూ.3.85 కోట్ల భారీ ధర పెట్టి దక్కించుకున్నాడో తండ్రి. ఆ కథేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
అబుదాబి అంతర్జాతీయ వేట, అశ్వశిక్షణ ప్రదర్శన (ADIHEX)లో అరుదైన తెల్ల ఫాల్కన్‌కు భారీ ధర పలికింది. అమెరికాలో పెంచిన ‘ఖార్మౌషా ప్యూర్ అల్ట్రా వైట్’ ఫాల్కన్ ఏకంగా 1.5 మిలియన్ యూఏఈ దిర్హమ్‌లకు (సుమారు రూ.3.85 కోట్లు) వేలంలో అమ్ముడైంది. ఈ అమ్మకం ఈ ఏడాది ADIHEX వేలంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరగా నిలిచింది. అబుదాబిలో జరుగుతున్న ADIHEX 2026 ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన ఐదవ విడత వేలంలో ఈ అరుదైన ఫాల్కన్‌ను విక్రయించారు. ‘అల్ట్రా వైట్ ప్యూర్ గైర్ ఖార్మౌషా’ పేరుతో ఉన్న ఈ ఫాల్కన్ పూర్తిగా తెల్లని ఈకలతో ఉండటం, అరుదైన రంగు, ప్రత్యేకమైన శారీరక లక్షణాలతో వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ఫాల్కన్‌ను అమెరికాలోని మార్క్ మొగ్లిచ్ ఫాల్కన్ ఫామ్‌లో పెంచారు. దీని బరువు సుమారు 1,000 గ్రాములు కాగా, పొడవు 16.5 అంగుళాలు, వెడల్పు కూడా 16.5 అంగుళాలుగా ఉంది. పూర్తిగా తెల్లని ఈకలతో కనిపించడం ఈ పక్షికి ప్రధాన ప్రత్యేకతగా నిలిచింది. అరుదైన రంగుతో పాటు దాని శారీరక నిర్మాణం, వేటకు అనువైన లక్షణాలు కొనుగోలుదారులను ఆకర్షించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈసారి ADIHEXలో స్థానిక, అంతర్జాతీయ స్థాయికి చెందిన 55 ప్రముఖ ఫాల్కన్ పెంపకం, సంరక్షణ ఫారాలు పాల్గొన్నాయి. గత ఏడాదితో పోలిస్తే పాల్గొంటున్న ఫారాల సంఖ్య 20 శాతం పెరిగింది. ఇందులో తొలిసారిగా పాల్గొంటున్న తొమ్మిది ఫారాలు కూడా ఉన్నాయి. దీంతో అబుదాబి వేదికగా నిర్వహించే ఫాల్కన్ వేలాలకు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనంగా మారింది.
ఫాల్కన్‌ల పెంపకం, సంరక్షణతో పాటు సంప్రదాయ వేట సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించడంలో ADIHEX కీలక పాత్ర పోషిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ వేలం ద్వారా ప్రపంచంలోని అత్యుత్తమ ఫాల్కన్ జాతులు, వాటి ప్రత్యేక రక్తసంబంధాలను ప్రదర్శించేందుకు అవకాశం లభిస్తోందన్నారు. అరుదైన తెల్ల ఫాల్కన్‌కు లభించిన రూ.3.85 కోట్ల ధర ఈ ప్రదర్శనలోని వేలాలపై ఉన్న ఆసక్తిని మరోసారి చాటిచెప్పింది.