
మీ పీఎఫ్ అకౌంట్లోని డబ్బులను విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇది మీ కోసమే. ఒక నెల రోజుల్లో కీలక ఫీచర్ అందుబాటులోకి రానుంది. అదే పీఎఫ్ యూపీఐ విత్ డ్రా ఆప్షన్. దీనిపై ఎప్పటినుంచో చర్చ జరుగుతుండగా.. ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని పీఎఫ్ ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ప్రవేశపెడతామంటూ కేంద్రం ప్రకటనలు చేస్తున్నా.. ఇప్పటివరకు రాలేదు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. సెప్టెంబర్‌లో ఈ ఫీచర్‌ను ఈపీఎఫ్ఓ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఈపీఎఫ్ఓ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఇది అందుబాటులోకి వస్తే యూపీఐ ద్వారా సెకన్లలోనే మీ పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. క్లెయిమ్ అందుకునేందుకు రోజుల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఇకపై ఉండకపోవచ్చు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్రస్తుతం యూపీఐ వ్యవస్థను నడుపుతోంది. ఈ సంస్థ ఇప్పుడు ఈపీఎఫ్‌తో కలిసి పీఎఫ్ యూపీఐ విత్ డ్రా సేవలను అభివృద్ది చేస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉండగా.. ఇది దాదాపుగా పూర్తి కావొస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌పీసీఐ సహకారంతో ఈపీఎఫ్ఓ ఈ ఫీచర్ తీసుకొస్తుంది. ఎన్‌పీసీఐ ఆధ్వర్యంలో భీమ్ యూపీఐ యాప్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ యాప్‌లో తొలుత పీఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నారు. యూపీఐతో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా పీఎఫ్ నగదు పొందవచ్చు. దీని వల్ల క్లెయిమ్, చెల్లింపు ప్రాసెస్ మరింత వేగవంతం అవుతుంది. క్లెయిమ్ ఆమోదం పొందిన తర్వాత యూపీఐకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా నగదు బదిలీ చేసుకోవచ్చు. తొలుత భీమ్ యాప్‌లో ప్రవేశపెట్టనుండగా.. అనంతరం మిగతా యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి వాటిల్లో తీసుకురానున్నారు.
దశల వారీగా అన్ని యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్‌లో పీఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. అయితే యూపీఐ ఆప్షన్ ద్వారా నగదు పొందాలంటే ఖచ్చితంగా సభ్యుడి యూఏఎన్ యాక్టివ్‌గా ఉండాలి. ఆధార్, పాన్, బ్యాంక్ కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలి. యూపీఐకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా పీఎఫ్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు క్లెయిమ్ ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం యూపీఐ ద్వారా సభ్యుడి బ్యాంక్ అకౌంట్‌కు నగదు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అయితే యూపీఐ సౌకర్యం ఉన్నంత మాత్రాన ఎప్పటికప్పుడు విత్ డ్రా చేసుకోలేరు. ఉద్యోగం మానేసినా, హెల్త్ ఎమర్జెన్సీ, విద్య, వివాహణం వంటి సమయాల్లో ఈపీఎఫ్ఓ నిబంధనలకు లోబడి ఉపసంహరించుకోవాల్సి ఉంటుది.