
ఈపీఎఫ్‌ఓకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పెంచింది. దీంతో రూ.25వేలలోపు జీతం పొందేవారు అందరూ తప్పనిసరిగా పీఎఫ్ పరిధిలోకి రానున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దాదాపు 51 లక్షల మంది ఉద్యోగులకు కొత్తగా పీఎఫ్ కవరేజీ దక్కనుంది. పెన్షన్, జీవిత బీమా వంటి ప్రయోజనాలు వారికి దక్కనున్నాయి.

అయితే పీఎఫ్ వేతన పరిమితి పెంపు వల్ల పింఛన్ కూడా పెరిగే అవకాశముంది. రిటైర్మెంట్‌కు ముందు చివరి 60 నెలల్లో పొందిన సగటు జీతం, ఫించన్ అర్హత జీతం ఆధారంగా ఫించన్ లెక్కిస్తారు. సభ్యుడి నెలవారీ జీతం = పింఛనుకు అర్హత గల జీతం X పింఛనుకు అర్హత గల సేవ / 70 ఫార్ములా ప్రకారం పింఛన్ లెక్కిస్తారు. కనీసం పదేళ్ల సర్వీస్ పూర్తి చేసినవారికి 60 ఏళ్ల తర్వాత నెలనెలా ఫించన్ అందుతుంది.

ఉదాహరణకు 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసినప్పుడు పదవీ విరమణకు ఏడాది మిగిలి ఉండి, రూ.17,000 పెన్షన్ అర్హత గల జీతం ఉన్నప్పుడు పెన్షన్ రూ. 2,429 అందుతుంది. పదవీ విరమణకు 2 సంవత్సరాలు మిగిలి ఉండి. పెన్షన్ అర్హత గల జీతం రూ.19 వేలు ఉంటే నెలవారీ పెన్షన్ రూ. 2,714గా ఉంటుంది. పదవీ విరమణకు 3 సంవత్సరాలు మిగిలి ఉండి, పెన్షన్ అర్హత గల జీతం రూ.21 వేలు ఉంటే.. పెన్షన్ రూ. 3 వేలు ఉంటుంది.

20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసినప్పుడు పదవీ విరమణకు ఏడాది ముందు పెన్షన్‌కు అర్హత గల జీతం రూ.17 వేలు ఉంటే నెలవారీ పెన్షన్ రూ.5343 ఉంటుంది. పదవీ విరమణకు 2 సంవత్సరాలు మిగిలి ఉండి, రూ. 19 వేల పెన్షన్ అర్హత గల జీతం ఉన్నప్పుడు నెలవారీ పెన్షన్ రూ. 5,971 అందుతుంది. 21 వేల పెన్షన్ అర్హత గల జీతం ఉన్నప్పుడు EPS పెన్షన్ రూ. 6,600 ఉంటుంది.

30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసినప్పుడు.. పదవీ విరమణకు ఏడాది మిగిలి ఉండి రూ. 17 వేల పెన్షన్ అర్హత గల జీతం ఉంటే నెలవారీ EPS పెన్షన్ రూ. 7,771 అందుతుంది. ఇక పదవీ విరమణకు 2 సంవత్సరాలు మిగిలి ఉండి, రూ.19 వేల పెన్షన్ అర్హత గల జీతం ఉన్నప్పుడు EPS పెన్షన్ రూ. 8,685గా ఉంటుంది. పదవీ విరమణకు 3 సంవత్సరాలు మిగిలి ఉండి, రూ. 21 వేల పెన్షన్ అర్హత గల జీతం ఉన్నప్పుడు EPS పెన్షన్ రూ. 9,600 వస్తుంది.