
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సభ్యులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త అందించింది. యూపీఐ, ఏటీఎంల ద్వారా పీఎఫ్ అకౌంట్లోని డబ్బులను విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించడంపై ఈపీఎఫ్ఓ గత కొద్ది నెలలుగా పనిచేస్తోంది. దీంతో ఈ ఫీచర్ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని కొద్ది నెలలుగా ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఉద్యోగుల ఎదురుచూపులకు తెరపడింది. ఈ నెలాఖరులో యూపీఐ సేవలను ప్రారంభించనున్నట్లు కేంద్ర కార్మికశాఖ అధికారి ఒకరు ప్రకటించారు. ఈ సదుపాయం తీసుకురావడానికి ముందు సర్వర్లు కనీసం మూడు రోజుల పాటు బ్లాక్ అవుట్ అవుతాయని వెల్లడించారు. 7 కోట్లకుపైగా సభ్యులు ఉన్న పీఎఫ్ అకౌంట్లు ఉన్నవారికి ఇది శుభవార్తగా చెప్పవచ్చు.
కార్మిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. EPFO 2.01 కింద కేంద్రీకృత IT వ్యవస్థ పనులు పూర్తయ్యాయని తెలిపారు. యూపీఐ ద్వారా నిధుల విత్ డ్రా చేసుకునే సదుపాయం ఈ నెలాఖరులోగా ప్రారంభమవుతుందన్నారు. సభ్యులు తమ క్లెయిమ్ మొత్తాన్ని యూపీఐ ద్వారా తక్షణమే తమ బ్యాంకు అకౌంట్లోకి పొందవచ్చని తెలిపారు. ఆ తర్వాత దానిని ఏదైనా ఏటీఎం నుండి విత్‌డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ ఫీచర్‌ను ప్రారంభించే ముందు కనీసం మూడు రోజుల పాటు ఈపీఎఫ్‌ఓ సర్వర్‌లను బ్లాక్ అవుట్ చేస్తానని అన్నారు. EPFO 2.01 కింద అమలు చేయబోయే సిస్టమ్‌ను అప్‌డేట్ చేయడానికి ఇది అవసరమని వివరించారు. ఈపీఎఫ్‌ఓ కొత్త నిబంధనల ప్రకారం.. సభ్యుని ఖాతాలో కనీసం 25 శాతం నిల్వ తప్పనిసరిగా ఉండాలి. మిలిగిన 75 శాతాన్ని ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. అనారోగ్యం, విద్య, వివాహం, గృహ నిర్మాణం వంటి కారణాలతో ఉపసంహరించుకోవచ్చు. రూ. 5 లక్షల వరకు ఉన్న క్లెయిమ్‌లను ఆటోమేటిక్‌గా ప్రాపెస్ చేశారు. 3 వర్కింగ్ డేస్‌లో అకౌంట్లలో జమ కానున్నాయి. ఆపైన జరిగే ట్రాన్సాక్షన్లకు మాన్యువల్ వెరిఫికేషన్ ఉంటుంది.
పీఎఫ్ అకౌంట్లను యూపీఐకు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా మీరు మీ పీఎఫ్ అకౌంట్లలోని బ్యాలెన్స్ చూసుకోవచ్చు. అనంతరం పిన్ ఎంటర్ చేసి మీ బ్యాంక్ అకౌంట్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సిస్టమ్‌ను అభివృద్ది చేస్తున్నారు. సరిగ్గా పనిచేస్తుందా.. లేదా అనేది కూడా పరీక్షిస్తున్నారు. పరీక్షల్లో గుర్తించి లోపాలను సరిచేస్తున్నారు. త్వరలో ఈ ప్రక్రియ ముగియనుండగా.. ఈ నెలాఖరులో అధికారికంగా లాంచ్ చేస్తారని తెలుస్తోంది. కాగా ఈ నెలాఖరులోగా పీఎఫ్ వడ్డీని కూడా జమ చేయనున్నట్లు కార్మికశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఈ నెలలో పీఎఫ్ వ్యవస్థలో పెద్ద మార్పులు జరగనున్నాయి.