
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విడతల వారీగా పీఎఫ్ ఖాతాదారులకు వడ్డీని జమ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అర్హులైనవారి అందరి అకౌంట్లలో క్రెడిట్ అయ్యాయి. దీంతో పీఎఫ్ అకౌంట్ ఉన్నవారందరూ తమకు ఎంత వడ్డీ పడిందా అనేది చెక్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం వడ్డీ రేటు 8.25 శాతంగా నిర్ణయించగా.. నెలవారీ రన్నింగ్ బ్యాలెన్స్ ఆధారంగా లెక్కించి విడుదల చేశారు. అయితే ప్రతీ ఏడాది చాలా ఆలస్యంగా పీఎఫ్ వడ్డీ జమ అయ్యేది. అయితే ఇటీవల సిస్టమ్ అప్‌గ్రేడ్ చేయడం, సెంట్రలైజ్డ్ డేటా బేస్ ఏర్పాటు చేయడంతో ప్రక్రియ వేగవంతంగా నిర్వహించారు.
ఇప్పటివరకు పీఎఫ్ వడ్డీ జమ అయిందా.. లేదా అనేది చెక్ చేసుకునేందుకు పీఎఫ్ పోర్టల్, ఉమాంగ్ యాప్, ఎస్‌ఎంఎస్, మిస్డ్ కాల్ విధానంలో చెక్ చేసుకునేవారు. కానీ ఇక నుంచి ఆ అవసరం కూడా లేదు. ఈపీఎఫ్‌వో నేరుగా మీ మొబైల్‌కు మెస్సేజ్‌లు పంపుతుంది. మీ ప్రమేయం లేకుండానే మీకు టెక్ట్స్ రూపంలో వడ్డీ వివరాలు పంపిస్తుంది. ఇప్పటికే పీఎఫ్ ఖాతాదారులందరూ తమ మొబైల్‌కు ఈపీఎఫ్‌వో నుంచి మెస్సేజ్‌లు పొందారు. ఈ మెస్సేజులో మీకు గత ఆర్ధిక సంవత్సరానికి ఎంత పీఎఫ్ వడ్డీ జమ అయిందనే వివరాలతో పాటు వడ్డీ అందిన తర్వాత మార్చి 31,2026 వరకు మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది పొందుపర్చింది. ఇదే కాకుండా ప్రతీ నెలా మీ పీఎఫ్ అకౌంట్లో యజమాన్యం డబ్బులు క్రెడిట్ చేశాక ఈపీఎఫ్ఓ నుంచి ఆటోమేటిక్‌గా మెస్సేజ్‌లు వస్తున్నాయి. దీంతో ఇక నుంచి మీరు పదే పదే బ్యాలెన్స్ తనిఖీ చేసుకునేందుకు వెబ్ సైట్, ఉమాంగ్ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఒకవేళ మీకు మెస్సేజ్ రాని పక్షంలో వెబ్ సైట్, ఉమాంగ్ యాప్, మిస్డ్ కాల్, ఎస్‌ఎంఎస్ సౌకర్యాల ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అయితే 8.25 శాతం వార్షిక వడ్డీని కేంద్రం నిర్ణయించింది. అంటే నెలకు సుమారుగా 0.688 శాతంగా ఉంటుంది. ఈ వడ్డీని నెలవారీ రన్నింగ్ బ్యాలెన్స్‌ల ఆధారంగా లెక్కించినప్పటికీ.. ప్రభుత్వం వడ్డీ రేటును నోటిఫై చేసిన తర్వాత సంవత్సరానికి ఒకసారి ఈపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తారు. ఈ సారి సుమారు 34 కోట్ల సభ్యుల ఖాతాలకు రూ.1.44 లక్షలకుపైగా వడ్డీని అందించారు. మీ వార్షిక వడ్డీ వెంటనే మీ ఖాతాలో పడటం లేట్ అయిన.. దానివల్ల మీరు ఎలాంటి నష్టం ఉండదు. నెలవారీ రన్నింగ్ బ్యాలెన్స్‌పై వడ్డీని లెక్కిస్తారు కాబట్టి ఖాతాలో క్రెడిట్ ఎంట్రీ ఎప్పుడు కనిపించినా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ఓ అకౌంట్లలో మీ నెంబర్ అప్డేట్ అయి ఉంటే నేరుగా బ్యాలెన్స్ వివరాలు అందుతాయి.