
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాదారులకు త్వరలో పెద్ద ఊరట లభించనుంది. ఇకపై PF డబ్బును నేరుగా ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడానికి సన్నాహాలు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, లక్షలాది మంది ఉద్యోగులకు కాగితపు పనుల తిప్పలు, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గనుంది. ప్రస్తుతం EPFO ద్వారా PF డబ్బును పొందాలంటే ఆన్‌లైన్ క్లెయిమ్‌లు లేదా కార్యాలయ ప్రక్రియలపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ కొత్తగా తీసుకొస్తున్న EPFO 3.0 వ్యవస్థలో, PF ఖాతాలను బ్యాంకింగ్ గేట్‌వేలకు అనుసంధానించి, ఏటీఎంలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నేరుగా డబ్బు తీసుకునే అవకాశం కల్పించనున్నారు.
విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ సాంకేతిక వ్యవస్థపై అవసరమైన పరీక్షలు పూర్తయ్యాయి. ఏటీఎంలలో డ్రై రన్‌లు, ఫైనల్ ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ప్రక్రియను సురక్షితంగా, పారదర్శకంగా రూపొందించినట్లు సమాచారం. ఈ పథకాన్ని త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. ఈ కొత్త సదుపాయం కోసం PF ఖాతాదారులకు ప్రత్యేక కార్డులు జారీ చేసే అవకాశముంది. ఈ కార్డులు నేరుగా వారి PF ఖాతాలకు అనుసంధానమై ఉంటాయి. దీని ద్వారా డబ్బు ఉపసంహరణ వేగవంతం కావడంతో పాటు జాప్యాలు తగ్గే అవకాశముంది.
ప్రస్తుతం PF డబ్బు విత్‌డ్రా చేయడానికి, ఖాతాదారులు UAN ద్వారా EPFO పోర్టల్‌లో లాగిన్ అయి, ఫారం 19 (పూర్తి విత్‌డ్రా), ఫారం 31 (పాక్షిక విత్‌డ్రా), లేదా ఫారం 10C (పెన్షన్ నిధులు) వంటి ఫారమ్‌లను ఎంపిక చేసి దరఖాస్తు చేయాలి. ఈ ప్రక్రియ కొంత సమయం తీసుకుంటుంది. కొత్తగా ప్రవేశపెట్టనున్న ATM విత్‌డ్రా సౌకర్యంతో PF ఖాతా బ్యాంక్ ఖాతా మాదిరిగానే మారనుంది. ఇది అమల్లోకి వస్తే ఉద్యోగులు అవసరమైనప్పుడు తక్షణమే తమ నిధులను పొందగలుగుతారు. దీంతో PF వ్యవస్థ మరింత సులభతరం, వినియోగదారులకు అనుకూలంగా మారనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి