Charging Stations: ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్‌లకు పెరిగిన డిమాండ్‌.. హైదరాబాద్‌ సహా 8 నగరాల్లో రెట్టింపు కానున్న స్టేషన్లు

Charging Stations: దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ బాగా పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను..

Charging Stations: ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్‌లకు పెరిగిన డిమాండ్‌.. హైదరాబాద్‌ సహా 8 నగరాల్లో రెట్టింపు కానున్న స్టేషన్లు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 20, 2022 | 9:23 AM

Charging Stations: దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ బాగా పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇటీవల కాలం నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశ వ్యాప్తంగా గత ఏడాదిలో ఎలక్ట్రిక్‌ వాహనాల (Electric Vehicle) అమ్మకాలు వేగంగా పెరిగిపోతున్నాయి. ఇందు కోసం ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్ల (EV Charging Stations) ఏర్పాటు కూడా ఊపందుకుంది. గడిచిన నాలుగు నెలల కాలంలో దేశ వ్యాప్తంగా తొమ్మిది మెగా సిటీల్లో వీటి సంఖ్య రెండు రెట్ల కంటే ఎక్కువగా ఉన్నాయని తాజాగా విద్యుత్‌ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు..

హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, పుణె, అహ్మదాబాద్‌, బెంగళూరు, కోల్‌కతా, సూరత్‌ నగరాల్లో ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు అధికంగా ఏర్పాటు అవుతున్నాయని తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఈ నగరాల్లో 678 పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు అయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 1,640 పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ స్టేషన్లలో ఈ తొమ్మిది నగరాల్లోనే 940 ఉండటం విశేషం.

చార్జింగ్‌ స్టేషన్‌లపై ప్రత్యేక దృష్టి..

భారీగా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తుండటంతో చార్జింగ్‌ స్టేషన్‌లపై ప్రత్యేక దృష్టి సారించడంతో స్టేషన్ల ఏర్పాటు వేగం పెరిగింది. 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ 9 నగరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది కేంద్రం. ఇక దేశ వ్యాప్తంగా జాతీయ రహదారుల వెంబడి ఉన్న 22 వేల ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. ఇందులో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ 10 వేల చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనుండగా, బీపీసీఎల్‌ 7 వేలు, హెచ్‌పీసీఎల్‌ 5 వేల స్టేషన్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐఓసీఎల్‌ 439 చార్జింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేయగా, ఈ సంవత్సరంలో మరో 2 వేల స్టేషన్‌లను ఏర్పాటు చేసేందుకు పనులు వేగవంతం చేస్తున్నట్లు ప్రకటించింది. బీపీసీఎల్‌ 52, హెచ్‌పీసీఎల్‌ 382 స్టేషన్లను నిర్వహిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తుండటంతో చార్జింగ్‌ స్టేషన్‌ల సంఖ్య కూడా పెరిగిపోతోంది. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రాంతాల్లో చార్జింగ్‌ స్టేషన్‌ల ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి కంపెనీలు.

ఇవి కూడా చదవండి:

Harley Davidson: హార్లే డేవిడ్సన్‌ నుంచి అద్భుతమైన ఎలక్ట్రిక్‌ బైక్‌.. యారో ఆర్కిటెక్చర్‌ టెక్నాలజీతో..

Savings Scheme: మీ కుమార్తె భవిష్యత్తును మెరుగుపర్చుకోవడం కోసం అద్భుతమైన స్కీమ్‌.. ఈ ప్రభుత్వ పథకంలో పన్ను మినహాయింపు