
RBI: ఆధునిక డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు సామాన్యుల అమాయకత్వాన్ని, త్వరితగతిన డబ్బు సంపాదించాలనే ఆశను ఆసరాగా చేసుకుని కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో అత్యంత ప్రమాదకరమైనది “మనీ మ్యూల్” (Money Mule) మోసం. దీనివల్ల బాధితులు ప్రమేయం లేకుండానే ఆర్థిక నేరాల్లో భాగస్వాములుగా మారి తీవ్ర చట్టపరమైన సమస్యల్లో చిక్కుకుంటున్నారు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వినియోగదారులను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తోంది. ఈ మనీ మ్యాల్ విషంలో జాగ్రత్తగా ఉండాలంటూ వాట్సాప్ ద్వారా సందేశాలను పంపుతోంది.
సైబర్ నేరగాళ్లు, అక్రమార్కులు చట్టవిరుద్ధంగా (ఆన్‌లైన్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా) సంపాదించిన డబ్బును నేరుగా తమ ఖాతాల్లోకి జమ చేసుకోరు. పోలీసుల నుంచి, దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోవడానికి సాధారణ ప్రజల బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తారు. ఇతరుల తరఫున అక్రమంగా వచ్చిన డబ్బును తమ బ్యాంక్ ఖాతా ద్వారా మరొక ఖాతాకు బదిలీ చేసే లేదా విత్‌డ్రా చేసి ఇచ్చే వ్యక్తిని “మనీ మ్యూల్” అంటారు.
సైబర్ నేరగాళ్లు మనీ మ్యూల్స్‌ను బుట్టలో వేసుకోవడానికి రకరకాల ఆఫర్లతో ఎర వేస్తుంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైమ్ ఉద్యోగాలకు వల వేస్తుంటారు. ఎలాంటి కష్టం లేకుండా రోజుకు కొన్ని నిమిషాలు కేటాయిస్తే వేలల్లో సంపాదించవచ్చని మెసేజ్‌లు పంపుతారు. మా ఖాతాలో ఏదో సాంకేతిక సమస్య ఉంది, మీ ఖాతాకు రూ. 50,000 పంపుతాం. అందులో రూ. 5,000 మీరు కమిషన్‌గా ఉంచుకుని మిగతా రూ. 45,000 మాకు వేరే అకౌంట్‌కి బదిలీ చేయండి అని ఆశ చూపుతారు. మీ అకౌంట్‌ను లేదా డెబిట్ కార్డ్‌ను నెలకు కొంత మొత్తం అద్దెకు ఇస్తే చాలని నమ్మిస్తారు. ఇలాంటి సమయంలో మీరు అత్యాశపడి బ్యాంక్ ఖాతాలు, ATM కార్డ్‌లు అద్దెకు ఇవ్వకండి.
చాలామంది మనకు తెలిసిన వారు కదా అని లేదా మనకు కమిషన్ వస్తుంది కదా అని లైట్ తీసుకుంటారు. కానీ ఇది తీవ్రమైన చట్టవిరుద్ధమైన చర్య.
అనుకోకుండా మీరు ఇలాంటి మోసంలో చిక్కుకున్నారని అనిపించినా, లేదా మీ ఖాతాలో గుర్తుతెలియని డబ్బు జమ అయినా తక్షణమే మీ బ్యాంకును సంప్రదించి సమాచారం అందించండి. అలాగే, ఆన్‌లైన్ సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.gov.in ద్వారా లేదా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి.
ఇది కూడా చదవండి: Bajaj Pulsar: ఆగస్టు 12న నెక్స్ట్ జనరేషన్ బజాజ్ పల్సర్ గ్రాండ్ ఎంట్రీ.. కొత్త ఫీచర్లతో అదిరిపోయే లుక్!
ఇది కూడా చదవండి: FASTag Pass: ఫాస్ట్ ట్యాగ్.. కేవలం రూ.340 చెల్లిస్తే చాలు నెల మొత్తం ఎన్ని సార్లు అయినా తిరగొచ్చు..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి