
House Construction: ఇంటి నిర్మాణంలో అనేక దశలు ఉన్నప్పటికీ, భవనం జీవితకాలాన్ని గణనీయంగా ప్రభావితం చేసే మొదటి మరియు అతి ముఖ్యమైన పొరపాటు పునాది (ఫుట్టింగ్) నిర్మాణంలోనే జరుగుతుంది. నిర్మాణ సమయంలో చేసే చిన్నపాటి లోపాల వల్ల భవనం మన్నిక తగ్గిపోతుంది. ఇందులో అత్యంత కీలకమైనది ఫుట్టింగ్ స్థాయి. మేస్త్రీలు, బిల్డర్స్ తెలిపిన వివరాల ప్రకారం..
పునాది (బేస్) వద్ద, 40mm కంకర (గ్రావెల్)తో కనీసం 6 అంగుళాల మందంతో సరైన పద్ధతిలో PCC (ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్) వేసి, ఆ తర్వాతే దానిపై ఫుట్టింగ్ మ్యాట్‌ను ఉంచాలి. అయితే, ఫుట్టింగ్ మ్యాట్‌లోని ఇనుప చువ్వలు (స్టీల్) ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా PCCని గానీ, చుట్టూ ఉన్న మట్టిని గానీ తాకకూడదు. అలా తాకడం వల్ల స్టీల్ త్వరగా తుప్పు పట్టి, పునాది బలహీనపడి భవనం పటిష్టత దెబ్బతింటుంది. దీనిని నివారించడానికి కాంక్రీట్ కవర్ కోసం 50mm కవర్ బ్లాక్‌లను తప్పనిసరిగా ఉపయోగించాలి.
ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఫుట్టింగ్ మ్యాట్ అంచుల వద్ద స్టీల్‌ను పైకి బెండ్ (L-bend) చేయడం. దీనివల్ల కాంక్రీట్ ఇనుమును గట్టిగా పట్టుకోవడమే కాకుండా, భవనంపై పడే ఒత్తిడిని (బెండింగ్ మూమెంట్స్), భూకంప లేదా ఇతర ప్రకంపనలను (వైబ్రేషన్స్) సమర్థవంతంగా తట్టుకుంటుంది. దురదృష్టవశాత్తు, దాదాపు 90 శాతం మంది ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ కీలకమైన దశలోనే పొరపాట్లు చేస్తుంటారు.
సులభంగా అర్థం చేసుకోవాలంటే.. పునాది మ్యాట్స్ మన పాదాల వంటివి అయితే, వాటి చుట్టూ ఉండే బెండ్స్ మన కాలి వేళ్ల వంటివి. మనం ఎంత బరువు మోసినా, కుదుపులకు గురైనా కాలి వేళ్లు మనల్ని కింద పడకుండా స్థిరంగా నిలబెట్టినట్లే, ఈ బెండ్స్ భవనానికి పూర్తి స్థిరత్వాన్ని అందిస్తాయి. ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ కలల ఇంటి జీవితకాలాన్ని దశాబ్దాల పాటు పదిలంగా ఉంచుకోవచ్చు.
మొత్తంగా చూస్తే, గృహ నిర్మాణంలో మొదటి, అతిపెద్ద పొరపాటు సరైన ఫుట్టింగ్ (బేస్) వేయకపోవడమేనని నిర్మాణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నాణ్యమైన సిమెంట్, సరైన కంకర నిష్పత్తి, నేల స్వభావాన్ని బట్టి తగిన లోతు, మట్టి పరీక్ష, సరైన క్యూరింగ్ (నీరు పట్టడం) చేయకపోతే భవనం బలహీనపడుతుంది. కాబట్టి, బలమైన పునాది కోసం అనుభవజ్ఞులైన సివిల్ ఇంజనీర్ సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం.
ఇది కూడా చదవండి: Jensen Huang: రాజీనామా చేసిన 11 రోజులకే సీఈఓగా రీఎంట్రీ.. అసలు ఏం జరిగింది?
ఇది కూడా చదవండి: Indian Railways: 604 కిలోమీటర్ల ప్రయాణం కేవలం 19 గంటల్లోనే.. పూర్తి వివరాలివే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి