
ప్రస్తుతం మార్కెట్ లింక్డ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పీఎస్), యూనిఫైడ్ ఫెన్షన్ స్కీమ్ (యూపీఎస్) అనే రిటైర్మెంట్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నెలకు రూ.లక్ష పింఛన్ పొందటానికి వీటిలో ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం. నేషనల్ ఫెన్షన్ స్కీమ్ (ఎన్ పీఎస్)ను 2004లో ప్రవేశపెట్టారు. ఇది మార్కెట్ లింక్డ్ స్కీమ్. ఈక్విటీ, డెట్ ఫండ్ పనితీరుపై ఆధారపడి మీకు పెన్షన్ రాబడి వస్తుంది. ఉద్యోగి ప్రాథమిక వేతనం, డియర్ నెస్ అలవెన్స్ (డీఏ)లో పది శాతం చందాగా చెల్లించాలి. అలాగే ప్రభుత్వం 14 శాతాన్ని జమ చేస్తుంది. దీనిలో పెన్షన్ మొత్తానికి హామీ ఉండదు. పదవీ విరమణ సమయంలో 60 శాతం ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 40 శాతాన్ని నెలవారీ చెల్లింపుల కోసం యాన్యుటీలో పెట్టుబడి పెట్టాలి.
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) లో స్థిరమైన పెన్షన్ పొందవచ్చు. ఇది చివరి ఏడాది సేవలో సగటు ప్రాథమిక జీతంలో 50 శాతంగా లెక్కిస్తారు. ప్రభుత్వం ఉద్యోగి ప్రాథమిక జీతం, డీఏలో 18.5 శాతం వాటాను అందిస్తుంది. యూపీఎస్ పెన్షన్ దారుల చివరి సంవత్సర జీతం రూ.2 లక్షలు అయితే, రిటైర్మెంట్ తర్వాత వారికి నెలకు రూ.లక్ష రూపాయల పెన్షన్ లభిస్తుంది. ద్రవ్యోల్బణంతో పాటు ప్రతి ఏటా ఇది పెరుగుతూ ఉంటుంది. ఎన్ పీఎస్ చందాదారులు రిటైర్మెంట్ అనంతరం నెలకు రూ.లక్ష పొందాలంటే వారు 35 ఏళ్ల పాటు నెలకు రూ.16,800 పెట్టుబడి పెట్టాలి. ఈ పథకం నుంచి వార్షిక రాబడి 9 శాతంగా అంచనా వేస్తారు. ఈ లెక్క ప్రకారం సుమారు రూ.5 కోట్ల మూలధనం పోగవుతుంది. దానిలో రూ.2 కోట్లు (40 శాతం) పెన్షన్ ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన యాన్యుటీలో పెట్టుబడి పెడతారు.
సంప్రదాయ పొదుపుదారులకు యూపీఎస్ చాలా బాగా సరిపోతుంది. ప్రభుత్వ మద్దతు ఉండడం, ప్రభుత్వ బాండ్లలో ఎక్కువగా పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదు. మార్కెట్ రాబడి కంటే స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి బాగా నప్పుతుంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరుగుతూ ఉండడం దీని అదనపు ప్రత్యేకత. ఎన్ పీఎస్ చందాలను ఈక్విటీ, ప్రభుత్వ బాండ్లు, ఇతర సాధనాలలో పెట్టుబడి పెడతారు. అధిక రాబడి కోసం రిస్క్ చేయడానికి ఇష్టపడే వారికి సరిపోతుంది. అయితే ఆదాయపు పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉండడం ఎన్ పీఎస్ ప్రత్యేకత. ఒక రకంగా చెప్పాలంటే యూపీఎస్ తో స్థిరత్వం, నిర్ణీత మొత్తం అందుతుంది. ఎన్ పీఎస్ తో మెరుగైన రాబడి సంపాదించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..