రోడ్డుపై తిరిగే పశువులు వల్ల కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నట్టు ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. రోడ్డు ప్రమాదాల్లో దేశంలోనే మొదటి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, దాని వెనుక కారణాలను విశ్లేషిస్తూ అకో యాక్సిడెంట్ ఇండెక్స్ పేరుతో ఇటీవల ఓ నివేదిక వెల్లడైంది. దేశంలోని వివిధ నగరాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు, వాటికి గల కారణాలు, ఏ కార్లకు ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగాయి అనే వివరాలను తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్ తదితర మెట్రో నగరాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. రోడ్లపై గుంతలు, జంతువులు ఢీకొనడం, కొబ్బరి కాయలు రాలడం తదితర కారణాలు వీటి వెనుక ఉన్నాయి. హ్యుందాయ్ ఐ10 కారు ప్రమాదానికి గురైన వాటిలో అగ్రస్థానంలో ఉంది.
రోడ్డు ప్రమాదాలలో హైదరాబాద్ 16.4 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్ 15.9 శాతంతో తర్వాత స్థానంలో కొనసాగుతోంది. పూణె, బెంగళూరు కూడా వెనుకనే ప్రయాణిస్తున్నాయి. ప్రమాదకర హాట్ స్పాట్లలో బెంగళూరులోని బొమ్మనహళ్లి ముందు వరుసలో కొనసాగుతోంది. నోయిడా, పూణేలోని మరుంజి, ముంబైలోని మీరా రోడ్డు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే బెంగళూరులో 44.8 శాతం ప్రమాదాలు రోడ్లపై గుంతల కారణంగా జరుగుతున్నాయి. ఇక ఢిల్లీలో 13.3, ముంబైలో 12.3 శాతం ప్రమాదాలకు అవే కారణమవుతున్నాయి. రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న పశువులు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వాటిలో వీధి కుక్కలదే అగ్రస్థానం. అలాంటి ఘటనల్లో 62 శాతం ఇవి ఆక్రమించాయి.
తర్వాత ఆవులు (29 శాతం), గేదెలు (4 శాతం) ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికంటే కొబ్బరి కాయలు రాలడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నివేదికలో వెల్లడైంది. ఎక్కువగా ప్రమాదాలకు గురైన కార్ల వివరాలను కూడా అకో యాక్సిడెంట్ ఇండెక్స్ తెలిపింది. హ్యుందాయ్ ఐ10 కార్లు మొదటి స్థానంలో నిలిచాయి. తర్వాత మారుతీ స్విఫ్ట్, బాలెనో, ఐ20, డిజైర్ కొనసాగుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి