
సాధారణంగా మనం పెట్టుబడి అంటే బంగారం, వెండి గురించే ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో రాగి ధరలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా రాగి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక టన్ను రాగి ధర 12,000 డాలర్లు దాటిపోయింది.ఈ ఏడాదిలోనే రాగి ధర 35 శాతం పెరిగింది. 2009 తర్వాత ఇంత భారీగా ధరలు పెరగడం ఇదే మొదటిసారి. అందుకే విశ్లేషకులు దీనిని కొత్త బంగారం లేదా కొత్త వెండి అని పిలుస్తున్నారు. ఈ ధరల పెరుగుదల వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి..
రాగికి ఒక్కసారిగా ఇంత డిమాండ్ పెరగడానికి పారిశ్రామిక – భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నాయి..
టెక్నాలజీ – ఎనర్జీ డిమాండ్: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, AI డేటా సెంటర్ల విస్తరణ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో రాగి వినియోగం విపరీతంగా పెరిగింది.
అమెరికా సుంకాల భయం: అమెరికా భవిష్యత్తులో విధించబోయే సుంకాల భయంతో, కొనుగోలుదారులు ఇప్పుడే భారీగా రాగిని కొనుగోలు చేసి గిడ్డంగులలో నిల్వ చేస్తున్నారు.
సరఫరాలో ఆటంకాలు: ఇండోనేషియాలోని ప్రధాన గనిలో ప్రమాదం, కాంగోలో గనుల్లో వరదలు, చిలీలో గని పేలుడు వంటి ఘటనల వల్ల ఉత్పత్తి తగ్గింది.
చైనా కోత: ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారు అయిన చైనా 2026లో తన రాగి ఉత్పత్తిని 10శాతం తగ్గించనున్నట్లు ప్రకటించడం మార్కెట్‌ను వేడెక్కించింది.
ఒకప్పుడు కేవలం వస్తువుల తయారీకే పరిమితమైన రాగి, ఇప్పుడు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. డిమాండ్ ఎక్కువగా ఉండటం, సరఫరా తక్కువగా ఉండటంతో దీనిని కొత్త బంగారం లేదా కొత్త వెండి అని పిలుస్తున్నారు.
ప్రముఖ ఆర్థిక సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా ప్రకారం.. 2026 నాటికి ఈ ధరలు కొంచెం తగ్గే అవకాశం ఉంది. అప్పట్లో టన్ను ధర 10,000 డాలర్ల నుండి 11,000 డాలర్ల మధ్య ఉండవచ్చని సమాచారం. అంటే ధరలు భారీగా పడిపోకపోయినా ప్రస్తుతం ఉన్నంత వేగంగా పెరగకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా పెరిగి, మార్కెట్ సమతుల్యత సాధించడం వల్ల ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో రాగి పాత్ర కీలకంగా మారడంతో, దీని ధరలు సాధారణ ప్రజల నుండి పారిశ్రామికవేత్తల వరకు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. భవిష్యత్తులో ఇది ఎంతవరకు స్థిరంగా ఉంటుందో చూడాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి