
ఇంట్లోనో, ఆఫీసులోనో, చేతిలోనో ఎంత నగదు ఉండొచ్చన్న చర్చ తరచుగా జరుగుతుంటుంది. “అమ్మో! ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటే ఐటీ రైడ్స్ వస్తాయి” అన్న భయం చాలామందిలో ఉంది. వార్తల్లో తరచుగా ‘రొట్టెలు కాల్చినంత డబ్బు స్వాధీనం’ వంటి శీర్షికలు కనిపించడంతో ఈ భయం మరింత పెరుగుతుంది. కానీ, నిజంగానే నగదు నిల్వపై పరిమితులున్నాయా? చట్టం ఏం చెబుతుంది?
నిజానికి, భారతదేశంలో నగదు నిల్వపై ఎటువంటి చట్టపరమైన పరిమితులు లేవు. మీరు ఎంత డబ్బునైనా ఇంట్లో, ఆఫీసులో, చేతిలో ఉంచుకోవచ్చు. దీనిపై ఎలాంటి నియంత్రణలు, నిబంధనలు లేవు. ఆదాయపు పన్ను శాఖ కూడా ‘ఇంతే నగదు ఉంచుకోవాలి’ అని ఎక్కడా నిర్వచించలేదు.
మరి, ఐటీ అధికారులు డబ్బు ఎందుకు స్వాధీనం చేసుకుంటారు? ఇక్కడే అసలు విషయం ఉంది. డబ్బు ఎంత ఉంది అన్నది కాదు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్నదే కీలకం. మీ దగ్గర ఉన్న ప్రతి పైసాకు సరైన ఆధారం ఉండాలి. జీతంగా సంపాదించినదా, ఆస్తి అమ్మినదా, వ్యాపారం ద్వారా వచ్చినదా… ఇలా డబ్బు వచ్చిన మార్గం చట్టబద్ధమైనదై ఉండాలి.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 68, 69బి ప్రకారం, ఆదాయానికి మించి కూడబెట్టిన ఆస్తులు, నగదు గురించి వివరించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్న నగదుకు అతను సరైన వివరణ ఇవ్వలేకపోతే, అది లెక్కల్లో చూపని ఆదాయంగా పరిగణించబడుతుంది. అప్పుడు ఆ మొత్తంపై 78 శాతం వరకు భారీ జరిమానా విధించవచ్చు.
కట్టలు కట్టలుగా డబ్బు ఉన్నా, ప్రతి రూపాయికి సరైన పత్రాలు, సంపాదన మార్గం, పన్ను చెల్లింపు రుజువులు చూపిస్తే సరిపోతుంది. ఇవి మీ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, వ్యాపార లావాదేవీల లెక్కలు, ఆదాయపు పన్ను రిటర్నులలో స్పష్టంగా కనిపించాలి.
కాబట్టి, భారతదేశంలో డబ్బు కలిగి ఉండటం నేరం కాదు. అది సరైన మార్గంలో సంపాదించినదై ఉండాలి. దానికి సంబంధించిన పత్రాలు పక్కాగా ఉండాలి. లేకపోతేనే చిక్కులు తప్పవు.