
డిజిటల్ లావాదేవీలు పెరిగిన తర్వాత సైబర్ నేరగాళ్లు సరికొత్త దారులను వెతుక్కుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆధార్ కార్డు నంబర్ ఆధారంగా బ్యాంక్ అకౌంట్లలోంచి డబ్బులు మాయం అవుతున్నాయనే వార్తలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం ఆధార్ నంబర్ తెలిస్తే అకౌంట్ ఖాళీ చేయడం సాధ్యమేనా? ఈ వింత మోసాలు ఎలా జరుగుతున్నాయి? వీటి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అనే విషయాలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక స్పష్టతనిచ్చింది. ఖచ్చితంగా సాధ్యం కాదు అని UIDAI స్పష్టం చేసింది. మీ ఏటీఎం కార్డ్ నంబర్ తెలిసినంత మాత్రాన పిన్ లేకుండా ఎవరూ డబ్బులు తీయలేరు కదా? ఆధార్ విషయంలో కూడా అంతే. కేవలం మీ ఆధార్ నంబర్ తెలిసినంత మాత్రాన మీ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ నుండి ఎవరూ ఒక్క రూపాయి కూడా విత్‌డ్రా చేయలేరు. ఆధార్ ఆధారిత లావాదేవీలకు ఖచ్చితంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ లేదా మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఖచ్చితంగా అవసరం అవుతాయి.
ఆధార్ నంబర్ ఒక్కటే తెలిస్తే డబ్బులు పోవు, కానీ నేరగాళ్లు దీనికి ఒక ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీనినే AePS (Aadhaar Enabled Payment System) స్కామ్ అంటున్నారు. ఇందులో కేటుగాళ్లు రెండు అంచెల్లో మోసానికి పాల్పడుతున్నారు:
డేటా చోరీ: సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉండే భూమి, ఆస్తి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో సాధారణంగా వేలిముద్రలు ఉంటాయి. సైబర్ నేరగాళ్లు తెలివిగా ఆ పత్రాల నుండి బాధితుల వేలిముద్రల డేటాను, ఆధార్ నంబర్లను సేకరిస్తారు.
సిలికాన్ క్లోనింగ్: సేకరించిన వేలిముద్రలను సిలికాన్ లేదా జెల్ అచ్చుల సహాయంతో క్లోనింగ్ చేస్తారు. ఆ తర్వాత బ్యాంకింగ్ కరస్పాండెంట్లు వాడే మైక్రో-ఏటీఎం డివైజ్‌లలో బాధితుల ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, ఈ నకిలీ సిలికాన్ వేలిముద్రలతో డబ్బులు లాగేస్తున్నారు. బయోమెట్రిక్ ఆధారిత లావాదేవీలకు ఓటీపీలతో పనిలేదు కాబట్టి బాధితుడి ఫోన్‌కు ఎలాంటి ముందస్తు అలర్ట్ రాదు. డబ్బులు కట్ అయ్యాక గానీ విషయం బయటపడదు.
ఈ తరహా మోసాల నుండి మన కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి అత్యంత సులువైన, పటిష్టమైన మార్గాలు ఉన్నాయి.
బయోమెట్రిక్స్ లాక్ చేయండి: UIDAI అధికారిక పోర్టల్ (uidai.gov.in) లేదా mAadhaar యాప్ ద్వారా మీ వేలిముద్రలను, ఐరిస్ డేటాను లాక్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీ బయోమెట్రిక్స్ లాక్ అయితే.. మీరు స్వయంగా అన్‌లాక్ చేసే వరకు ఏ మోసగాడూ మీ వేలిముద్రలతో రూపాయి కూడా తీయలేడు. అవసరమైనప్పుడు క్షణాల్లో అన్‌లాక్ చేసుకుని, పని అయిపోయాక మళ్లీ లాక్ చేసుకోవచ్చు.
మాస్క్‌డ్ ఆధార్ వాడండి: ఎక్కడైనా జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సి వస్తే, ఆధార్ నంబర్‌లోని చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే “Masked Aadhaar” ను ఉపయోగించండి. దీనివల్ల మీ పూర్తి ఆధార్ నంబర్ ఇతరుల చేతికి చిక్కదు.
ఎస్ఎంఎస్ అలర్ట్స్ గమనించండి: మీ బ్యాంక్ అకౌంట్ నుండి నగదు డెబిట్ అయినట్లు వచ్చే ఎస్ఎంఎస్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.
ఓటీపీలు షేర్ చేయకండి: బ్యాంక్ అధికారులు లేదా UIDAI ప్రతినిధులమని చెబుతూ ఫోన్ చేసే ఎవరికీ మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీలను చెప్పకండి.
అనధికారికంగా మీ అకౌంట్ నుండి AePS ద్వారా డబ్బులు కట్ అయినట్లు గుర్తిస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ బ్యాంక్‌ను సంప్రదించి సమాచారం ఇవ్వాలి. అలాగే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి.