Britannia: చాలా మందికి ఎంతో ఇష్టమైన బిస్కెట్లు ఇప్పుడు మరింత ప్రియం!

ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ బ్రిటానియా తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. పామాయిల్, ఇంధన ధరల పెరుగుదల, అంతర్జాతీయ ఉద్రిక్తతలే దీనికి ప్రధాన కారణాలు. రూ.10 పైన ఉన్న బిస్కెట్ ప్యాకెట్లపై ఈ పెంపు ఎక్కువగా ఉండగా, చిన్న ప్యాకెట్లలో బిస్కెట్ల పరిమాణం తగ్గించి 'శ్రింక్‌ఫ్లేషన్' అమలు చేసే అవకాశం ఉంది.

Britannia: చాలా మందికి ఎంతో ఇష్టమైన బిస్కెట్లు ఇప్పుడు మరింత ప్రియం!
Britannia

Updated on: May 08, 2026 | 10:56 PM

ప్రతిరోజూ టీతో పాటు బిస్కెట్లు తినడం చాలా కుటుంబాల్లో అలవాటుగా మారిపోయింది. అయితే ఇప్పుడు టీతో తినే బిస్కెట్లు కూడా ఖరీదవుతున్నాయి. ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ బ్రిటానియా త్వరలో తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా రూ.10 కంటే ఎక్కువ ధర ఉన్న బిస్కెట్ ప్యాకెట్లపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం పెద్ద ప్యాకెట్ల ధరలను దశలవారీగా పెంచనున్నారు. చిన్న ప్యాకెట్ల ధరల్లో మార్పు లేకపోయినా, వాటిలో బిస్కెట్ల పరిమాణం తగ్గించే అవకాశం ఉంది. ఈ విధానాన్ని సాధారణంగా శ్రింక్‌ఫ్లేషన్‌గా పిలుస్తారు. అంటే ధర అదే ఉంచి, ఉత్పత్తి పరిమాణాన్ని తగ్గించడం.

కంపెనీ తాజా ఆర్థిక ఫలితాల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. నాల్గవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 21 శాతం పెరిగినా, మొత్తం ఆదాయం మార్కెట్ అంచనాలను అందుకోలేదు. కంపెనీ ఆదాయం సుమారు రూ.4,686 కోట్లుగా నమోదైంది. ఫలితంగా స్టాక్ మార్కెట్‌లో కంపెనీ షేరు 4 శాతానికిపైగా పడిపోయింది. బిస్కెట్ ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులను కంపెనీ పేర్కొంటోంది. ముఖ్యంగా బిస్కెట్ల తయారీలో ఉపయోగించే పామాయిల్ ధరలు, ఇంధన వ్యయాలు, రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ సరుకు రవాణాపై ప్రభావం పడటంతో తయారీ ఖర్చులు కూడా పెరిగాయి.

స్ట్రెయిట్‌ ఆఫ్‌ హార్ముజ్‌ ప్రాంతంలో నౌకాయాన అంతరాయాలు ఏర్పడటం వల్ల అంతర్జాతీయ ఎగుమతులపై కూడా ప్రభావం పడింది. సరుకు రవాణా నౌకల కొరత కారణంగా కంపెనీ విదేశీ మార్కెట్లకు సరైన సమయంలో సరఫరాలు చేయలేకపోయింది. దీనివల్ల అంతర్జాతీయ ఆదాయంపై ఒత్తిడి పెరిగింది. కంపెనీ సీఈఓ వరణ్‌ బెర్రీ ప్రకారం వచ్చే ఐదు నెలలకు అవసరమైన పామాయిల్ ఒప్పందాలను ముందుగానే కుదుర్చుకున్నప్పటికీ, దీర్ఘకాలికంగా లాభదాయకతను కాపాడుకోవాలంటే ధరల పెంపు తప్పనిసరి అయిందని తెలిపారు. ఇక మార్కెట్లో తక్కువ ధరలకు లభిస్తున్న స్థానిక, చిన్న బ్రాండ్ బిస్కెట్ల పోటీ కూడా కంపెనీ అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి ధరలు పెంచే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us