
రచ్చ.. కల్లోలం.. బ్లాక్ మండే.. పేర్లు ఏవైనా పెట్టుకోండి.. డొనాల్డ్ ట్రంప్ సుంకాల బాంబ్‌కు- ప్రపంచమంతా బెంబేలెత్తిపోతోంది. రైతుల నుంచి స్టాక్‌మార్కెట్ల వరకు అంతా గోలగోల. ప్రపంచంపై ట్రంప్ వేసిన సుంకాల ఆటంబాంబ్ ఏ రేంజ్‌లో ఉందో నేడు కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌లతో అర్ధమవుతోంది.. ట్రంప్ ప్రతీకార సుంకాలతో ప్రపంచ స్టాక్‌మార్కెట్లతోపాటు.. భారత స్టాక్ మార్కెట్‌లలో కల్లోలం కనిపిస్తోంది. సోమవారం ప్రారంభం కాగానే.. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి.. సెన్సెక్స్ 3900 పాయింట్లకు పైగా పడిపోయింది.. నిఫ్టీ 1140 పాయింట్లకు పైగా నష్టంలో పతనమైంది. స్టాక్ మార్కెట్లపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ కనిపించింది.. మొత్తంగా భారత స్టాక్ మార్కెట్లు 5 శాతం నష్టపోయాయి.. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా సహా మౌలికరంగాల షేర్లు అన్ని పతనమయ్యాయి.
ట్రంప్ ప్రతీకార సుంకాలతో ప్రపంచ స్టాక్‌మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి.. ఆసియా, ఆస్ట్రేలియా మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కనిపిస్తున్నాయి. జపాన్ నిక్కీ 8 శాతం, కొరియా కోస్పి సూచీ 5 శాతం డౌన్ అయ్యాయి. ఆస్ట్రేలియా స్టాక్‌మార్కెట్ 6 శాతం పడిపోయింది. హాంకాంగ్ స్టాక్‌మార్కెట్లు 9 శాతం పతనం అయ్యాయి. అయితే- స్టాక్‌మార్కెట్ల ఈ మహా పతనాన్ని ట్రంప్ ఏమాత్రం లెక్కచేయడం లేదు. సుంకాలను మెడిసిన్ అంటూ ప్రెసిడెంట్ అభివర్ణించడం కలకలం రేపుతోంది.. స్టాక్‌మార్కెట్ల పతనంపై ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తంచేస్తుండగా.. ట్రంప్ మాత్రం ఈ సుంకాలను- రోగానికి మందు అనే అర్థం వచ్చేలా అభివర్ణిస్తున్నారు.
ఈ ప్రతీకార సుంకాల విషయంలో తమ ప్రభుత్వ నిర్ణయం సముచితమే అని ప్రజలు గ్రహిస్తారంటూ ఆయన తన సోషల్ మీడియా పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. సుంకాలు చాలా మంచివని ట్రంప్ చెప్పుకున్నారు. ముఖ్యంగా చైనా, యూరోపియన్ యూనియన్‌తో తమకు వాణిజ్య లోటు భారీగా ఉందనీ, ఈ సమస్యకు ఇప్పటి సుంకాలు పరిష్కారం చూపుతాయని ట్రంప్ ఈ పోస్టులో వివరించారు.
ట్రంప్ సుంకాల నిర్ణయాలతో అమెరికా స్టాక్‌మార్కెట్లు దారుణంగా నష్టపోయాయి. ఈ తెల్లవారుజామున మొదలైన ఆసియా, ఆస్ట్రేలియా మార్కెట్లు కూడా తీవ్రంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్, చైనా, హాంకాంగ్, దక్షిణకొరియా ఇలా అన్నిచోట్లా ఇదే పరిస్థితి. మరి, మన స్టాక్‌మార్కెట్ల పరిస్థితి ఏంటి? భారీగా నష్టాలు మూటకట్టుకోవడానికి మన ఇన్వెస్టర్లు రెడీగా ఉండాలా? ట్రంప్ పేరుతో లాస్ ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలా? ట్రంప్ ఇస్తున్న షాక్స్ ఎలా ఉన్నాయో మరో గంటసేపట్లో తేలిపోతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..