
రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్. రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు, పారదర్శకంగా పంపిణీ చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ‘సార్థక్ పీడీఎస్’ పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. దేశ ప్రజలకు అవసరమైనతంగా, నాణ్యమైన ఆహార ధాన్యాల లభ్యతను కేంద్ర ప్రభుత్వం అందించడంలో భాగంగా కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 81.35 కోట్ల మందికి ఆహార ధాన్యాలను సమర్థవంతంగా అందించడంలో “సార్థక్ పీడీఎస్” పథకం ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ పథకం కోసం రూ. 25,530 కోట్లను ప్రభుత్వం ప్రకటించింది.
ఐదు సంవత్సరాల వరకు ఈ పథకం కొనసాగుతుంది. రేషన్ రవాణా, ఆహార ధాన్యాల నిర్వహణ, ఎఫ్‌పిఎస్ పంపిణీదారుల మార్జిన్ వంటి వాటి కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భరించే ఖర్చులను భర్తీ చేయడం ‘సార్థక్ పీడీఎస్’ పథకం లక్ష్యం.
రేషన్ పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం సాంకేతికతను ఉపయోగించుకోనుంది. ఇందుకోసం ఒక అప్లికేషన్ తీసుకురానుంది. రేషన్ ధాన్యం నిల్వ, పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా నివారించనుంది. ఇందుకోం బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ అందేలా చేయనున్నారు. దీనిని ఆధార్ లేదా బయోమెట్రిక్ వ్యవస్థకు అనుసంధానిస్తారు. ఈ వ్యవస్థ ద్వారా గిడ్డంగుల నుండి సరసమైన ధరల దుకాణాలకు సరఫరా చేయబడిన ధాన్యాన్ని రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తారు. ఇందులో రేషన్ కార్డుల నిర్వహణ, కొత్త కార్డుల కోసం దరఖాస్తు, సవరణ ప్రక్రియలను సరళీకరించడం వంటి వాటి డిజిటలైజేషన్ కూడా ఉంటుంది. ఇక గోదాముల నుండి ఎంత బియ్యం, పప్పు బయలుదేరింది. రేషన్ దుకాణాలకు ఎంత చేరింది. అందులో ఎంత ప్రజలకు చేరింది అనే సమాచారం అందుతుంది.