
టెక్ ప్రపంచంలో మరో భారీ యుద్ధానికి తెరలేవబోతోంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని అమెజాన్ పదేళ్ల తర్వాత మళ్ళీ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. ఈసారి కేవలం హార్డ్‌వేర్ ఫీచర్లతో కాకుండా, విప్లవాత్మకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో వినియోగదారులను ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తోంది. అమెజాన్ అత్యంత రహస్యంగా డెవలప్ చేస్తున్న ఈ ఏఐ ఫోన్‌కు ‘ట్రాన్స్‌ఫార్మర్’ అనే కోడ్‌నేమ్ పెట్టింది. సాధారణ స్మార్ట్‌ఫోన్లలో మనం రకరకాల యాప్స్ ఓపెన్ చేసి పనులు చేసుకుంటాం. కానీ, ఈ ఏఐ ఫోన్‌లో యాప్ స్టోర్లతో పెద్దగా పని ఉండదు. అంతా వాయిస్ కమాండ్స్ ద్వారానే జరుగుతుంది. ఉదాహరణకు, మీరు ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా లేదా సినిమా చూడాలన్నా కేవలం నోటితో చెబితే చాలు, అడ్వాన్స్‌డ్ అలెక్సా అసిస్టెంట్ ఆ పని పూర్తి చేస్తుంది.
2014లో అమెజాన్ విడుదల చేసిన ‘ఫైర్ ఫోన్’ ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. ఆ సమయంలో కంపెనీ దాదాపు 170 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. ఆ చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈసారి వినియోగదారుల అవసరాలను పూర్తిగా మార్చేసేలా ‘యూజర్ ఎక్స్‌పీరియన్స్’పై దృష్టి సారించింది.
ప్రధాన ఆకర్షణలు:
వాయిస్ ఫస్ట్ డిజైన్: ఫోన్ ఆపరేషన్ అంతా వాయిస్ కమాండ్స్ చుట్టూనే తిరుగుతుంది.
డంబ్ ఫోన్ మోడల్: డిజిటల్ డిటాక్స్ కావాలనుకునే వారి కోసం బేసిక్ ఫీచర్లతో కూడిన మోడల్‌ను కూడా తీసుకురానుంది.
దిగ్గజాల టీమ్: మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ వంటి పాపులర్ డివైజ్‌లను రూపొందించిన పానోస్ పనయ్, జే అల్లార్డ్ వంటి దిగ్గజాలు ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో, అమెజాన్ ఏఐ ఫోన్ ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే, ఆపిల్, శాంసంగ్ వంటి దిగ్గజాలకు ఇది గట్టి పోటీ అవ్వడం ఖాయం అంటున్నారు టెక్ నిపుణులు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..