Airbag (representative Imag)
Airbag Industry Growth: వాహనాల తయారీలో ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రప్రభుత్వం వాహనాల తయారీ పరిశ్రమను కోరింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో అన్ని రకాల కార్లలో
ఎయిర్‌బ్యాగ్ సదుపాయం కల్పించాలని ఆదేశించింది. దీంతో ఈ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న కార్లను మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుండటంతో ఈ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం రూ.2,500 కోట్ల రూపాయలుగా ఉన్న ఈ పరిశ్రమ.. 2026-27 నాటికి రూ.7వేల కోట్లకు చేరుకుంటుందని ప్రముఖ రేటింగ్ ఏజేన్సీ ఇక్రా అంచనా వేసింది. ఒక్కో ఎయిర్‌బ్యాగ్ తయారుచేయడానికి ప్రస్తుతం రూ.3వేల నుంచి రూ.4వేల వరకు ఖర్చు అవుతుండగా, నూతన మార్గదర్శకాలకు లోబడి తయారు చేస్తే అయ్యే ఖర్చు రెండు రెట్లు పెరిగి రూ.8 వేల నుంచి రూ. 10 వేలకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం సరాసరిగా కార్లలో మూడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండగా, వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి వీటి సంఖ్య ఆరుకి చేరుకోనున్నాయని ఇక్రా తెలిపింది.
రాబోయే కాలంలో ఎయిర్‌బ్యాగ్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుండగా, ప్రతి సంవత్సరం వృద్ధి 30 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. ఎయిర్‌బ్యాగ్ పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటో కాంపోనెంట్ సెగ్మెంట్లలో ఒకటని ICRA తెలిపింది. వాహనాల్లో ప్రయాణీకుల భద్రతను పెంచడానికి కార్లలో ఎయిర్‌బ్యాగ్‌ల సంఖ్యను పెంచనున్నట్లు పేర్కొంది.
గతంలో ప్రతి కారులో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరిగా ఉండేదని ICRA తెలిపింది. M1 కేటగిరీ వాహనాలకు ఇది రెండు బ్యాగ్‌లకు పెంచబడిందని తెలిపింది. ఈ వాహనాలు ఎనిమిది మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంటాయి. 3.5 టన్నుల కంటే తక్కువ బరువు కలిగి ఉంటాయని ఇక్రా వెల్లడించింది.
2023 అక్టోబర్ 1 నుంచి తయారు చేయనున్న M1 కేటగిరీ వాహనాలకు, రెండు వైపులా ఎయిర్‌బ్యాగ్‌లు, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేయబడ్డాయి. ముందు వరుసలో ఉన్న అవుట్‌బోర్డ్ సీట్లకు గాయం కాకుండా ఉండటానికి ఈ సౌకర్యం కల్పించనున్నారు. దీనితో పాటు, ఔట్‌బోర్డ్ సీటింగ్ పొజిషన్‌లో కూర్చున్న వ్యక్తులకు తలకు గాయాలు కాకుండా ఇది కాపాడనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..