మన దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. పర్యావరణ హిత ప్రయాణంతో పాటు మెయింటెనెన్స్ లేకపోవడం, లోకల్ అవసరాలకు చక్కగా సరిపోతుండటంతో అందరూ వీటిని ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఇటీవల తన గ్యారేజీకి బీగాస్ ఆర్‌యూవీ 350 ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. ముంబైలోని విల్లే పార్లే నుంచి అర్జున్ తన కొత్త రైడ్‌ను ప్రారంభించి, అనేక చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన వద్ద ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ బీగాస్ కంపెనీకి చెందినది. పూర్తి మెటల్ బాడీతో కూడిన ఆర్‌యూవీ ఇది. ఆర్‌యూవీ అంటే రగ్డ్ అర్బన్ వెహికల్. ఈ స్కూటర్ఱ స్పెసిఫికేషన్లు, ధరలు, ఇతర కీలక వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బీగాస్ ఆర్‌యూవీ 350 ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఏడాది జూన్‌లోనే భారత మార్కెట్లో విడుదలైంది. ఈ స్కూటర్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అందులో బేస్ లెక్స్ మోడల్, మిడ్-స్పెక్ ఈఎక్స్ మోడల్, టాప్-ఎండ్ మ్యాక్స్. యాక్టర్ అర్జున్ మ్యాక్స్ వేరియంట్‌ని కొనుగోలు చేశారు.
స్కూటర్ సొగసైన, రెట్రో డిజైన్‌ను కలిగి ఉంది. ఇన్‌వీల్ హైపర్‌డ్రైవ్ మోటారును కలిగి ఉంది. ఇది గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ టాప్ వేరియంట్ 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. అయితే, ఇతర రెండు వేరియంట్‌లు 2.3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటాయి. ఇది సింగిల్ చార్జ్ పై 90 కిమీ డ్రైవింగ్ రేంజ్‌ను కలిగి ఉంటాయి.
స్కూటర్‌లో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, నోటిఫికేషన్ అలర్ట్‌లు, నావిగేషన్ ప్రాంప్ట్‌లను అందించే 5-అంగుళాల కలర్ టీఎఫ్టీ డిస్‌ప్లే, హిల్-హోల్డ్ అసిస్టెన్స్, ఫాల్-సేఫ్ టెక్నాలజీ వంటి అనేక ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. వెనుకవైపు డ్రమ్ బ్రేక్‌లు, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు ట్విన్ షాక్ అబ్జార్బర్‌లతో వస్తుంది. ఈ స్కూటర్ మూడు రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. అవి ఎకో, రైడ్, స్పోర్ట్. అలాగే మూడు ఛార్జర్ ఎంపికలను అందిస్తుంది. అవి 500వాట్లు, 840వాట్లు, 1350వాట్ల ఫాస్ట్ ఛార్జర్. ఇది క్రూయిజ్ నియంత్రణను కలిగి ఉంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2 గంటల 35 నిమిషాలు మాత్రమే పడుతుంది.
ఈ స్కూటర్ ఐదు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంది – మాగ్నైట్ గ్రే టైర్‌లతో మిస్టిక్ గ్రీన్, ఆస్ట్రో బ్లూ, బ్లాక్, గ్రాఫైట్ గ్రే విత్ సన్‌సెట్ ఎల్లో వీల్స్, ఫర్రీ రెడ్ అండ్ బ్లాక్, చివరగా రూజ్ ఆరెంజ్ వీల్స్‌తో ప్లాటినం సిల్వర్.. దీనినే అర్జున్ కపూర్ కొనుగోలు చేశారు.
ఇక ధరల విషయానికి వస్తే లెక్స్ వెర్షన్ ధర రూ. 1.09 లక్షలు (ఎక్స్-షోరూమ్), మిడ్-స్పెక్ ఈఎక్స్ వేరియంట్ ధర రూ. 1.24 లక్షలు (ఎక్స్-షోరూమ్), టాప్-ఎండ్ మ్యాక్స్ వేరియంట్ ధర రూ. 1.34 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..