
దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది లేకపోతే ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు దేశంలో పొందలేము. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందటం దగ్గర నుంచి సిమ్ కార్డు తీసుకునేవరకు ప్రతీ పనికి దీని అవసరం పడుతుంది. పెద్దవారి నుంచి అప్పుడే పుట్టిన పసి పిల్లవాడి వరకు ప్రతీఒక్కరికీ ఆధార్ తప్పనిసరిగా అవసరం. పిల్లల కోసం కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తూ ఉంటుంది. వీటిని పొందాలన్నా ఆధార్ అవసరం. పిల్లల కోసం ప్రత్యేక బాల ఆధార్‌ను యూఐడీఏఐ జారీ చేస్తుంది. ఆధార్ సేవా కేంద్రాల్లో దీనిని పొందవచ్చు. దీనిపై కేవలం చిన్నారుల ఫొటో మాత్రమే ఉంటుంది. ఇవి తల్లిదండ్రుల ఆధార్‌కు లింక్ అయి ఉంటాయి.
అయితే పిల్లలకు ఆధార్ కార్డు తీసుకోవాలంటే డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ అనేది తప్పనిసరి. ఆధార్ కార్డులో వారి డేట్ ఆఫ్ బర్త్‌ను ముద్రించేందుకు ఇది అవసరం. అయితే కొంతమంది తల్లిదండ్రులు వెంటనే డేట్ ఆఫ్ బర్త్ కోసం దరఖాస్తు చేయరు. అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చులే అనుకుని జాప్యం చేస్తూ ఉంటారు. అయితే పిల్లలకు ఆధార్ కార్డు అత్యవసరమైనప్పుడు అవసరం పడుతుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చెందుతుంటారు. అయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా పిల్లలకు ఆధార్ పొందవచ్చు. ఇందుకోసం ఒక మార్గం అందుబాటులో ఉంది. డేట్ ఆఫ్ బర్త్ లేని పిల్లలకు ఇది సదావకాశంగా చెప్పవచ్చు.
ఒకవేళ పిల్లలకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే DOMICILE సర్టిఫికేట్‌తో ఆధార్ కార్డు కోసం తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. తల్లి లేదా తండ్రి ఆధార్ అడ్రస్ ఒక్కటే అయి ఉండాలి. DOMICILE దరఖాస్తు పూర్తి చేసి VROకు అందించాలి. వీఆర్వో సర్టిఫై చేశాక సంబంధిత తహసిల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టుకోవాలి. తహసిల్దార్ పరిశీలించి అనంతరం సర్టిఫై చేస్తారు. ఆ సర్టిఫికేట్‌తో పాటు తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు సమర్పించి పిల్లలకు కొత్త ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తి స్థానికుడు అని నిర్ధారించానికి ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. వివిధ ప్రభుత్వ పథకాలు పొందేందుకు కూడా ఈ డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది. దీంతో ఈ విధానంలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా పిల్లలకు ఆధార్ తీసుకోవచ్చు. ఈ విషయం చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు.