
పంచభూతాలు.. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం.. ఇవి మనకు జీవితాన్ని ఇస్తాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే పంచభూతాలు మాత్రం మన జీతాన్ని మింగేస్తున్నాయి. ఆదాయం పెరుగుతున్నప్పటికీ, నెలాఖరుకు చేతిలో డబ్బు మిగలడం లేదని చాలా మంది వ్యక్తులు, కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. మన ఖర్చులు ఆదాయం కంటే వేగంగా పెరుగుతున్నాయి. నిత్యావసరాల నుంచి బంగారం వరకు ప్రతి వస్తువు ధరలు అనూహ్యంగా పెరగడం ఈ ఆర్థిక అసమతుల్యతకు ప్రధాన కారణం. గతంలో 40 ఏళ్ల క్రితం కూడా ధరల పెరుగుదలపై పాటలు వచ్చేవంటే, ఇది నిరంతర సమస్య అని అర్థమవుతుంది.
రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒక వస్తువు సరఫరా తగ్గితే దాని ధర పెరుగుతుంది. మార్కెట్‌లో వస్తువుల లభ్యత తగ్గడం, వినియోగదారుల డిమాండ్ పెరగడం ధరల పెరుగుదలకు దారితీస్తుంది.
వర్షాలు సరిగా పడకపోవడం, ఎల్ నినో వంటి వాతావరణ ప్రభావాలు వ్యవసాయ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉల్లి, టమాటా, చక్కెర, బియ్యం వంటి వాటి దిగుబడి తగ్గడం వల్ల మార్కెట్‌లో కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి.
ఇజ్రాయిల్-పాలస్తీనా, ఇరాన్-అమెరికా వంటి యుద్ధాలు, ఆఫ్రికా దేశాల్లోని అంతర్గత సంక్షోభాలు చమురు సరఫరాను దెబ్బతీసి, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. రవాణా ఖర్చులు పెరిగినప్పుడు, రవాణా అయ్యే అన్ని వస్తువుల ధరలూ పెరుగుతాయి.
రైతుల నుంచి తక్కువ ధరకు కొని, మార్కెట్‌లో కృత్రిమ కొరతను సృష్టించి, ఎక్కువ ధరకు అమ్మే మధ్యవర్తుల వ్యవస్థ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. కొన్నిసార్లు ధనవంతులు కూడా పెద్ద మొత్తంలో నిల్వ చేసుకుని, కొరతను మరింత పెంచుతారు.
దసరా, బోనాలు, పెళ్లిళ్ల సీజన్ వంటి సమయంలో వస్తువులకు డిమాండ్ పెరిగి ధరలు అమాంతం పెరుగుతాయి.
ఈ ధరల పెరుగుదల పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నెలవారీ బడ్జెట్లు తలకిందులై, ఆహారం, వైద్యం, విద్య వంటి ప్రాథమిక అవసరాల కోసం కేటాయించిన డబ్బు సరిపోవడం లేదు. పిల్లలకు సరైన పోషకాహారం అందక వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. రుణభారం పెరిగి, కుటుంబాలలో ఘర్షణలు, మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
ప్రభుత్వ జోక్యం.. నిల్వలను నియంత్రించడం, కృత్రిమ కొరతను నిరోధించడం, అవసరమైనప్పుడు దిగుమతులు పెంచడం ద్వారా ధరలను అదుపులో ఉంచాలి.
వ్యవసాయ రంగానికి మద్దతు.. రైతులకు సబ్సిడీలు, విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించాలి. నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచాలి.
మౌలిక సదుపాయాల కల్పన.. ప్రతి గ్రామంలో కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మించి, రైతులు తమ పంటలను నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించాలి. ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి, పండించిన పంటలకు విలువ జోడించాలి.
మధ్యవర్తుల వ్యవస్థ రద్దు.. ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి పంటలను కొనుగోలు చేసి, వినియోగదారులకు చేరవేయాలి.
రవాణా, లాజిస్టిక్స్ మెరుగుదల.. సరుకుల రవాణా ఖర్చులను తగ్గించడానికి మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించాలి.
ధరల నియంత్రణ కేవలం ఆర్థిక సమస్య కాదు. ఇది కుటుంబాల స్థిరత్వం, ప్రజల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతతో ముడిపడి ఉన్న సామాజిక సమస్య. దీనిని అరికట్టడానికి ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రణాళికలతో పాటు ప్రజల సహకారం కూడా అవసరం.