హైదరాబాద్ జంటనగరాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. నగరంలో ఉరుములు మెరుపులతో సుమారు గంటపాటు కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల రహదారులకు అడ్డంగా చెట్లు విరిగిపడటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. వర్షం నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈదురు గాలుల ధాటికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని ఫ్లడ్‌లైట్ టవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. టవర్ మీద పడటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనలో పలు కార్లు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది.
పాతబస్తీలో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. భారీ వర్షంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో పలుచోట్ల భారీ వృక్షాలు కుప్పకూలాయి. ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్‌కు ఈదురు గాలులతో కూడిన భారీ వర్ష సూచన ఉండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.