ఢిల్లీకి చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఢిల్లీ పర్యటనలో భాగాంగా జేపీ నడ్డాతో పవన్ భేటీ అయ్యారు. పొత్తులు, అమరావతి అంశం గురించి చర్చించినట్టు సమాచారం. నెల రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం ఢిల్లీకి వెళ్ళారు. మంగళగిరిలోకి పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి పయనమయ్యారు. రాజధాని రైతుల ఆందోళనని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకే పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్ళారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అమరావతి ప్రాంత రైతుల ఆందోళనపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటున్నారు పవన్ కళ్యాణ్. ఢిల్లీలో అమిత్‌షాను, వీలైతే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి పరిస్థితిని వివరిస్తారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చిన వెంటనే ఉద్యమ కార్యాచరణ ప్రారంభించాలనుకుంటున్న పవన్ కల్యాణ్.. ఈలోగా ఢిల్లీ పెద్దలకు పరిస్థితిని వివరించాలని భావిస్తున్నారు. కేంద్రం జోక్యం చేసుకునేలా జనసేన పార్టీ కార్యాచరణ ఉంటుందని శుక్రవారం అమరావతి ఏరియా రైతులకు పవన్ కల్యాణ్ తెలిపారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఢిల్లీ యాత్రకు పూనుకున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితిని సమీక్షించి, సంక్రాంతి పండగ తర్వాత మరోసారి పార్టీ నేతలతో సమావేశమై.. అప్పటి పరిస్థితికి అనుగుణంగా పార్టీ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని తెలుస్తోంది.