హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ తెరాసలో చేరనున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్ బీ ఫామ్‌పై పోటీకి తాను సిద్ధమని హరిప్రియ ప్రకటించారు. ఇల్లెందు అభివృద్ధికి సీఎం కేసీఆర్ బాటలో పయనించాలని నిర్ణయించుకున్నానని.. ఆయన సారథ్యంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో తాను కూడా భాగస్వామ్యం అవుతానని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా తెరాసలో చేరనున్నట్లు శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. తన నియోజకవర్గంతో పాటు నల్గొండ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని లింగయ్య చెప్పారు.