
Big News Big Debate: అటు అమరావతి రైతులపాదయాత్ర ముగింపు సభకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు 18న జరిగే రాయలసీమ చైతన్య సభను విజయవంతం చేయాలంటూ పలు జిల్లాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రెండు భిన్న స్వరాలకు తిరుపతే వేదికగా మారింది. పోటాపోటీ సభలతో పోలీసులకు బందోబస్త్ సవాలుగా మారితే.. రాజకీయ పార్టీలకు ఇవే ఎజెండాలుగా మారిపోయాయి. తిరుపతిలో అమరావతి రైతుల సభను విజయవంతం చేయాలని TDP, BJP, లెఫ్ట్ పార్టీలు పిలుపు ఇస్తుంటే.., యాత్ర చేసింది రైతులు కాదని.. TDP రియల్ ఎస్టేట్ వ్యాపారులేనంటున్నారు మంత్రి బొత్స.
విపక్షాల ఐక్యతా రాగంతో సర్కార్ దిగొస్తుందా?
తిరుపతిలో రెండు సభలకు ఏర్పాట్లు ఓవైపు అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభ, మరోవైపు రాయలసీమ చైతన్య సదస్సు. హైకోర్టు నుంచే పర్మిషన్లు తీసుకుని ఎవరికి వారు సభలను విజయవంతం చేసేందుకు మద్దతు కూడగడుతున్నారు. TDP, BJP, లెఫ్ట్, జనసేన సహా పలు సంఘాలు అమరావతి రైతులకు మద్దతు తెలిపాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ నుంచి కన్నా లక్ష్మినారాయణ, సీపీఐ నుంచి రామకృష్ణ హాజరువుతున్నారు. అమరావతి సభకు అన్ని ప్రాంతాల నుంచి ప్రజలను సమీకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళే సన్నాహక ర్యాలీలు నిర్వహించింది. అటు ఈ నెల 18న జరిగే రాయలసీమ చైతన్య సభను విజయవంతం చేయాలంటూ సీమ జిల్లాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించారు. రాయలసీమ హక్కులు, జరగాల్సిన అభివృద్ధి , జరిగిన అన్యాయంపై గొంతు విప్పేందుకు పెద్ద ఎత్తున వచ్చి రాయలసీమ చైతన్య సభను విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు.
తిరుపతి సభపై కుట్ర చేస్తుందెవరు?
సభల సక్సెస్ వ్యవహారం అలా ఉంటే.. అధికార విపక్షాలు మరోసారి రాజధాని అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకుంటున్నాయి. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని.. రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకమంటున్నాయి విపక్షాలు. జగన్ తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకుని రాజధానిగా అమరావతిని ప్రకటించాలంటున్నాయి TDP, లెఫ్ట్, BJP. అమరావతి సభలో వైసీపీ నాయకులు మేథావుల ముసుగులో అల్లర్లకు కుట్ర చేస్తున్నారంటూ పొలిటికల్ బాంబ్ పేల్చారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అటు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ కుట్రలు చేస్తుందన్నారు మాజీమంత్రి పుల్లారావు.
అసలు తిరుపతిలో జరిగేది రైతుల ముగింపు సభే కాదని.. టీడీపీ సమావేశం అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స. అమరావతిలో అవినీతి జరిగిందని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీయే చెప్పారన్నారు. రాజకీయ దురుద్దేశంతో BJP స్టాండ్ మార్చుకుందన్న బొత్స.. టీడీపీయే కావాలని సభలో అల్లర్లు సృష్టించేలా ఉందన్నారు మంత్రి.
రాజకీయంగా విపక్షాలన్నీ అమరావతికి మద్దతుగా సభలో పాల్గొంటున్నాయి. అయితే తమ విధానం మారదని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది అధికారపార్టీ వైసీపీ. మూడు రాజధానులకే కట్టబడి ఉంటామని ప్రకటించింది. మరి సభ ద్వారా పార్టీలు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నాయి. దీనికి రాయలసీమ హక్కుల సంఘాలు అటు వైసీపీ ఎలాంటి బదులు ఇవ్వబోతుందన్నది ఉత్కంఠగా మారింది.
(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)
ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్ డిబేట్ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.